
భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు పంపిణీ
చేవెళ్ల: ప్రజల వద్దకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందని విలేజ్ బస్సు అధికారులు (వీబీఓలు) ఎ.రవీందర్, సి.బాల్‌రాజ్ అన్నారు. భద్రాచలం సీతారాములు కల్యాణ తలంబ్రాలకోసం ముందుగా బుక్ చేసుకున్న చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లోని ప్రజలకు శనివారం వీబీఓలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం సీతారాములు కల్యాణ తలంబ్రాలు కావాలనుకునేవారు ఆర్టీసీ కార్గో సేవల ద్వారా బుక్ చేసుకోవాలని ఆయా మండలాల్లో ముందుగా ప్రచారం చేసినట్లు చెప్పారు. అప్పుడు బుక్ చేసుకున్నవారికి భద్రాచలం నుంచి కార్గో సర్వీస్ ద్వారా ప్యాకింగ్‌లో వచ్చిన తలంబ్రాలను అందజేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్టు వివరించారు. సేవలపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
అవినీతి నిర్మూలనకు
నడుం బిగించాలి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహేశ్వరం: అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మొహబ్బత్‌నగర్ గ్రామ పరిధిలోని అవేర్ సంస్థలో శనివారం ‘అవినీతి– న్యాయవ్యవస్థ’ అంశంపై బీఈడీ విద్యార్థులకు నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. అవినీతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమైందని, దానిని కూకటివేళ్లతో పెకిలించాలని అన్నారు. తెలంగాణలో గత పాలకులు చేసిన తప్పులే ప్రస్తుత పాలకులు చేస్తున్నారన్నారు. గతంలో చేసిన అవినీతి తప్పిదాలు పునరావృతం కాకూడదన్నారు. డబ్బుతో ప్రజాస్వామ్యం, ఓట్లను ఎప్పుడూ కొనలేరన్నారు. యువత అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలని ఆయన పిలు పునిచ్చారు. గిరిజనులు, దళితులు, ఆదివా సీలు, పేద విద్యార్థుల సంక్షేమం కోసం అవేర్ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అంతకు ముందు ప్రముఖ న్యాయవాదులు, ప్రొఫెసర్లు అవినీతి – న్యాయవ్యవస్థ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్‌జీ, డైరెక్టర్ రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
వరదల నివారణకు ముందస్తు చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వర్షాలొస్తే నగరంలో ముంపు సమస్యలు తగ్గడం లేదు. రోడ్లు, కాలనీలు, బస్తీలు చెరువులుగా మారే పరిస్థితి తప్పడం లేదు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ) ద్వారా వరద కాల్వల విస్తరణ, ఆధునికీకరణ పనులతో సమస్యలు కొంత మేర తగ్గినా, పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో వర్షాలకు ముందస్తుగానే తగిన చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చనే ఆలోచనలో ఉన్న జీహెచ్‌ఎంసీ వాతావరణ శాఖ, టీజీడీపీఎస్‌లతో కలిసి సమన్వయంతో పని చేయాలని భావిస్తోంది. నగరంలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నాయో.. ఎంతమేర కురియనున్నాయో ముందుగానే తెలిస్తే.. అక్కడ అవసరమైన యంత్రాంగాన్ని మోహరించడం, వరద కట్టడికి చర్యలు తీసుకోవడం వంటివి చేయొచ్చని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. వర్షాల్లో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. సంబంధిత రెయిన్ సెన్సర్ల ద్వారా వర్షపా తాన్ని పర్యవేక్షిస్తూ, తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు వర్షాకాలంలో సమస్యల పరిష్కారానికి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే యోచనలో అధికారులున్నారు. వీటికి దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏర్పాటు చర్యలు చేపట్టనున్నారు. ఎటొచ్చీ రాబోయే వర్షాకాలం లోగా ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.