ఒక్కవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటిష్ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. అందునా బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. తాజాగా.. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె రాణి ప్రస్థానం గమనిస్తే..
కీలక పరిణామాలకు మౌనసాక్షి
70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్–2 రాణి ప్రపంచంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై ప్రసార మాధ్యమాలు సంస్థలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్–2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు. ఎలిజబెత్ కుమారుడు చార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన కింగ్ చార్లెస్–3గా పదవిలో కొనసాగుతారు.
నిరాడంబర జీవితం
క్వీన్ ఎలిజబెత్ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనా, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందేలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను పోషించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు కూడా కావడం గమనార్హం. క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు.
► ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు.
► తల్లిదండ్రులు.. కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్
► గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం.
► 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
► క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకానికి.. సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెదాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా విన్‌స్టన్ చర్చిల్ ఉన్నారు.
► 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు.
► యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు.
► ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న థాయ్‌లాండ్ రాజు భూమి బోల్ అదుల్యదేజ్ (1946-2016 మధ్య 70 ఏండ్ల 126 రోజులు పాలన చేశారు)ను ఎలిజబెత్-2 దాటేశారు. మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కి చెందిన లూయిస్-14 (1643-1715 మధ్య కాలంలో 72 ఏండ్ల 110 రోజులు) ఉన్నారు.
► 2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
► భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు.
► ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసం అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
► అనారోగ్యంతో ఆమె మరణించిన క్రమంలో ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటించింది బకింగ్ హామ్ ప్యాలస్. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో ఇప్పటికే సిద్ధపడ్డారు అధికారులు.
► ఎలిజబెత్-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment