కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన తీరు.. అక్కడి దృశ్యాలను చూసిన వాళ్లెవరైనా.. అది ఎంత తీవ్రమైందో అంచనా వేసేయొచ్చు. అలాంటిది సహాయక చర్యల దగ్గరి నుంచి.. తిరిగి పట్టాలపై ఆ రూట్‌లో రైళ్లు పరుగులు తీయడం దాకా.. అంతా జెట్‌స్పీడ్‌తో జరిగింది. మునుపెన్నడూ లేనంతగా కేవలం 51 గంటల్లో ఈ ఆపరేషన్ ముగిసింది. ఎలా?..
అందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో మన దేశంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా.. రైల్వే మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం, అందుకు తగ్గట్లే కొందరు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, బాలాసోర్ ఘటన వేళ.. అశ్విని వైష్ణవ్ త్వరగతిన స్పందించిన తీరు, స్వయంగా ఆపరేషన్‌ను ఆయనే దగ్గరుండి పరిశీలించడం లాంటివి ఆయన మీద ప్రతికూల విమర్శలు రాకుండా చేశాయి.
⛑️ ప్రమాదం జరిగిన గంటల్లోపే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఎం నవీన్ పట్నాయక్ కంటే ముందుగానే.. వేకువ ఝామున అక్కడికి చేరుకుని ప్రమాద తీవ్రతను, సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సహాయ, పునరావాస చర్యల వేగం ఊపందుకుంది. అశ్వినీ వైష్ణవ్ ఒకప్పుడు బాలాసోర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు. అలాగే.. 1999లో ఒరిస్సా(ఇప్పటి ఒడిశా) భారీ తుఫాను ముప్పును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవమూ ఆయనకు ఈ సందర్భంగా పనికొచ్చాయి.
⛑️ జరిగింది భారీ ప్రమాదం. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటిది ఎరిగింది లేదు. ఒకవైపు శవాల గుట్టలు.. మరోవైపు పెద్ద సంఖ్యలో బాధితులు. పకడ్బందీ కార్యాచరణ, ప్రణాళిక లేకుండా ఈ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లడం కష్టం. ఆ స్థానంలో ఎవరున్నా ఇబ్బందిపడేవాళ్లేమో!. కానీ, విపత్తుల నిర్వహణపై ఆయనకున్న అవగాహన, గత అనుభవం.. బాలాసోర్ ప్రమాద వేళ సాయపడింది. అధికారులతో మాట్లాడి, సాంకేతిక సమస్యలను అధిగమించే వ్యూహ ప్రణాళిక సిద్ధం చేశారు. స్వయంగా ఆయనే దగ్గరుండి అంతా పర్యవేక్షించారు.
VIDEO | Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work at the triple train accident site in Odisha’s Balasore. pic.twitter.com/U7Xno9BDpt
— Press Trust of India (@PTI_News) June 4, 2023
⛑️ 2, 300 మంది సిబ్బంది.. రైల్వే శాఖ నుంచి ఎనిమిది బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రతి రెండు బృందాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు వేర్వేరుగా పర్యవేక్షించారు. ఆ సీనియర్ సెక్షన్ ఇంజనీర్లపై డివిజనల్ రైల్వే మేనేజర్, జనరల్ మేనేజర్ పర్యవేక్షణ కొనసాగింది. వారిని రైల్వే బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.
#WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw takes stock of the restoration work that is underway overnight at the site where #Balasoretrainaccident took place pic.twitter.com/TkulNKv3H7
— ANI (@ANI) June 3, 2023
⛑️ బాధితులను వేగంగా ఆసుపత్రులకు తరలించడం, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూసేందుకు కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాలు ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్ ను కటక్ హాస్పిటల్ కు, డైరెక్టర్ జనరల్ హెల్త్ ను భువనేశ్వర్ హాస్పిటల్ కు పంపించారు.
⛑️ నాలుగు కెమెరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాల తీరును ఆ కెమెరాల సాయంతో సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పురోగతిని మంత్రికి అందించారు.
- సాధ్యమైనంత మేర మరణాలను తగ్గించడం, !
- బాధితులకు మెరుగైన చికిత్స అందించడం,
- వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టడం..
⛑️ ఇవే లక్ష్యాలుగా ఆయన ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అలా 51 గంటల్లోనే మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వంలో రైలు సేవలను పునరుద్ధరించగలిగారు.
ఈ నెల 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో మెయిల్ లైన్ లో వెళుతున్న యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికి 288 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment