Late Kannada SuperStar Birth Anniversary Special: పునీత్ రాజ్‌కుమార్.. నువ్వయ్యా నిజమైన జగదేకవీరుడివి! ఇండియన్ సినిమాలో ఏ హీరోకు సాధ్యం కానీ ఫీట్ అప్పు సొంతం! ఏంటో తెలుసా?
‘అమ్మా.. ఆయన ఫొటో వాట్సాప్‌లో ఎందుకు స్టేటస్ పెట్టుకున్నావ్?’.. అనే కొడుకు ప్రశ్నకు..
‘‘లేదు బిడ్డా.. ఆయన కన్నడ హీరో అట. చాలా మంచోడు అట. 45 స్కూళ్లు కట్టించాడట. 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపిస్తున్నాడట. 19 గోశాలలకు సాయం చేస్తున్నాడట. ఇప్పుడు చనిపోయినా రెండు కళ్లూ దానం చేశాడట. ఇంత మంచోడు ఇయ్యాల రేపు ఉంటాడా?.. అందుకే స్టేటస్ పెట్టిన్రా అని సమాధానం ఇచ్చింది ఆ తల్లి.
ఎక్కడ కర్ణాటక.. ఎక్కడ తెలుగు రాష్ట్రాలు.. పోనీ పునీత్ ఆయన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయమా? అంటే.. అదీ లేదు. ఓ చిన్న సాయం చేసి ప్రపంచానికి ఎలా చెప్పాలా? అని అనుకుంటాం మనమంతా. కానీ, స్టార్ హీరోగా ఉండి కూడా పునీత్ అలా కాదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది.
ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం. ఆ.. ఎలా బతికామన్నదాన్ని బట్టే, ఎంతకాలం జనం గుండెల్లో నిలిచిపోతామన్నది ఉంటుంది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం.. తన అభిమానులనే కాదు.. ఏమాత్రం సంబంధం లేని వేరే రాష్ట్ర ప్రజలను సైతం కదిలించింది. పాతిక లక్షల మంది కరోనా లాంటి మహమ్మారిని సైతం లెక్కచేయకుండా పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు.. అతను సంపాదించుకున్న అభిమానం ఎంత గొప్పదో!.. ఆ అభిమానం చిరకాలం సజీవంగా ఉంటుంది కూడా!.
తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ లెజెండరీ నటుడు. తల్లి దివంగత పార్వతమ్మ.. నిర్మాత. పెద్దన్న శివ రాజ్‌కుమార్ స్టార్ హీరో. రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ నటుడు కమ్ నిర్మాత. మొత్తం కుటుంబం సినీ నేపథ్యం ఉన్నా, బాల్యం నుంచే తెర మీద కనిపిస్తున్నా.. టాలెంట్‌తో ఎదిగిన పునీత్ అంటే అక్కడి జనాలకు ఇష్టం ఎక్కువ. తెర మీద ఒక స్ప్రింగ్‌లా అప్పు స్టెప్పులు వేస్తుంటే.. రెప్పవేయరు ఆడియొన్స్. ఆయన డైలాగ్ డెలివరీని మాస్‌తో పాటు క్లాస్ ఆడియొన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ ఫాలోయింగ్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఒరియెంటెడ్ కంటెంట్ సినిమాలూ చిన్నవయసులోనే ఆయన క్రేజ్‌ను విపరీతంగా పెంచాయి. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి.
‘గుడిసలె ఆగలి.. అరమనే ఆగలి.. అటవే నిల్లదు ఎందు ఆట నిల్లదు
గుడిసెలో ఉన్నా.. బంగళాలో ఉన్నా.. అతనెప్పుడూ ఒకేలా ఉంటాడు. దాని చుట్టూనే ఆడుకుంటాడు.
హిరియరె ఇరళి.. కిరియరి బరళి.. బెదవే తోరదు.. ఎందు బేధ తోరదు
చిన్న అయినా.. పెద్ద అయినా.. అందరినీ గౌరవిస్తాడు. ఉన్నతంగా జీవిస్తాడు.
ఎల్ల ఇద్దు ఎను ఇళ్లద హాగే బదుకిరువా
ఉన్నతుడు కానీ గర్వం చూపించడు
ఆకాశ నోడద కైయె నిన్నదు ప్రీతి హంచిరువా
మధురమైన పాత జ్ఞాపకాలతో గడిపేస్తుంటాడు..’
పునీత్ రాజ్‌కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రాజకుమార సినిమా టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇవి. అలాంటి జ్ఞాపకాలనే కుటుంబానికి, అశేష అభిమానులకు అర్థాంతరంగా మిగిల్చి వెళ్లిపోయాడు అప్పు.
పునీత్ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు..
పునీత్ చనిపోయేనాటికి వయసు 46 ఏళ్లు. సినీ ప్రస్థానం సాగింది 45 ఏళ్లు. ఆరు నెలల వయసుకే లోహిత్(పునీత్ పసితనంలో పేరు) తండ్రి లీడ్ రోల్ చేసిన ‘ప్రేమదా కనికే’ చిత్రంలో కనిపించాడు. బెట్టాడ హూవు సినిమాకుగానూ ఏకంగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నేషనల్ అవార్డు అందుకున్నాడు లోహిత్(పునీత్). 1976 నుంచి 89 మధ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా కన్నడ సినిమాల్లో సందడి చేశాడు.
- పూరి జగన్నాథ్ డైరెక్షన్లో హీరోగా 2002లో అప్పు తో(తెలుగు ఇడియట్‌కి రీమేక్) ఎంట్రీ. ఒక హీరో తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి వరుసగా ఆరు సినిమాలు.. వంద రోజులు పూర్తి చేసుకుని కమర్షియల్ సక్సెస్ సాధించగలడా?. ఇండియన్ సినిమాలో ఆ రికార్డు పునీత్ పేరిట ఉంది. దానిని ఇప్పటిదాకా ఎవరూ బ్రేక్ చేసింది లేదు.
- 19 ఏళ్ల హీరో కెరీర్లో 29 సినిమాల్లో నటించాడు. శాండల్‌వుడ్‌లో మోస్ట్ సక్సెస్‌లు సాధించిన హీరోగా గుర్తింపు. అందుకే కన్నడలో పవర్ స్టార్ ట్యాగ్ దక్కింది ఆయనకు.
- అప్పు, అభి, వీర కన్నడిగ(ఆంధ్రావాలా రీమేక్), మౌర్య, ఆకాశ్, అజయ్(ఒక్కడు రీమేక్), అరసు, మిలనా, వంశీ, రామ్, జాకీ(పునీత్ స్టార్‌డమ్‌ను ఆకాశానికి చేర్చిన సినిమా), హుడుగరు, రాజకుమార, అంజనీ పుత్ర(తమిళ చిత్రం పూజై రీమేక్).. ఇలా పునీత్ కెరీర్లో కమర్షియల్ బ్లాక్బస్టర్లుగా నిలిచిన సినిమాలు.
- ముంగారు మలే(తెలుగులో ‘వాన’గా రీమేక్).. కన్నడ నాట ఒక సెన్సేషన్ హిట్. ఆ సినిమా కలెక్షన్లకు చాలా కాలం తర్వాత బ్రేక్ చేసింది పునీత్ రాజ్‌కుమారే. ఆయన నటించిన ‘రాజకుమార’ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత కే.జీ.ఎఫ్ చాప్టర్ 1 ఆ రికార్డును క్రాస్ చేసేసింది.
- నటుడు, ప్లేబ్యాక్ సింగర్, టెలివిజన్ ప్రజెంటర్, నిర్మాత, వాయిస్ ఓవర్.. ఇలా పునీత్ మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ విషయంలో తండ్రి దివంగత రాజ్‌కుమార్‌కు ఏమాత్రం తీసిపోని ఆణిముత్యం పునీత్. చిన్నవయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా మెప్పించాడు. హీరోగా రాణిస్తున్న టైంలోనూ.. ప్రొఫెషనల్ సింగర్‌లాగా ఎన్నో సినిమాలకు.. అదీ ఇతర హీరోలకు సైతం పాడారు.
అజాత శత్రువు
స్టార్ డమ్ ఉన్న హీరోకి ఫ్యాన్స్ వార్ తప్పని విషయం. మరి పునీత్‌కు ఇలాంటివేం లేవా? అనే అనుమానాలు రావొచ్చు. ఆ విషయంలో పునీత్ ఫ్యాన్స్‌ను మెచ్చుకోవాల్సిందే. డ్యాన్సులో పోటీపడే హీరోలు ఉన్నా.. అంతా పునీత్‌తో సమానంగా అవతలి హీరోలనూ అభిమానించేవాళ్లే. అభిమానులే కాదు.. హీరోలూ పునీత్‌ను ఒక మంచి మిత్రుడిగా చూస్తుంటారు. ఎందుకంటే పునీత్‌కు తానొక బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని, స్టార్ హీరోను అనే గర్వం ఏ కోశాన కనిపించదు. అందుకే తమ సినిమా ఈవెంట్లలలో పునీత్‌కు ఆప్యాయంగా ప్రత్యేక ఆహ్వానం అందిస్తారు. ఇక సీనియర్లను పునీత్ గౌరవించే తీరు చూస్తే ఎవరైనా ఆయనకు ఫిదా కావాల్సిందే. ఒక కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ, ఆఖరికి బాలీవుడ్‌లోనూ పునీత్‌కు మంచి స్నేహితులు ఉన్నారు.
విమర్శలు లెక్కచేయడు
అన్ని భాషల్లోలాగే.. మిగతా భాషల్లోనూ మిగతా హీరోల్లాగే పునీత్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. సినిమాల్లోకి రాకముందు.. సినిమాల్లోకి వచ్చాక.. నెపోటిజం దగ్గరి నుంచి బాడీ షేమింగ్ దాకా ఎన్నింటినో చిరునవ్వుతో దాటేశాడు. సినిమాలపైనా, వ్యక్తిగత విమర్శలపై ఏనాడూ అతిగా ఆయన స్పందించింది లేదు. కన్నడ సోదరసోదరీమణులు అప్పూ అని పిల్చుకునే పునీత్.. శాశ్వతంగా దూరమైనా ఆయన సినిమాలు, వేల మందికి అందుతున్న సాయం రూపంలో నిత్య సజీవుడిగా ఉంటాడు. ఆ అభిమానం అలాంటిది మరి.
మార్చి 17న కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్‌కుమార్ 47వ జయంతి సందర్భంగా..
Comments
Please login to add a commentAdd a comment