SP Founder Mulayam Singh Yadav Political Journey And Personal Life Details - Sakshi
Sakshi News home page

ఎస్పీ ‘నేతాజీ’ ములాయం: కుస్తీల వీరుడు.. కటిక పేదరికం సైకిల్‌ను గుర్తుగా చేసింది!

Published Mon, Oct 10 2022 12:24 PM | Last Updated on Mon, Oct 10 2022 1:58 PM

SP Founder Mulayam Singh Yadav political journey Personal Life - Sakshi

సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఒక ఎత్తు అయితే.. యూపీ రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారాయన. ఓటమెరుగని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా.. భారతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. బీసీ నేతగా.. యూపీలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, ఔనత్యానికి ఆయన చేసిన కృషి విశేషమైనది. అంతేకాదు.. అభిమానుల చేత ముద్దుగా ‘నేతాజీ’ అని పిలిపించుకుంటూ.. లక్షల మంది ఎస్పీ కార్యకర్తలను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. 

ములాయం సింగ్‌ యాదవ్‌.. 1939 నవంబర్‌ 22న ఎటావా జిల్లా సైఫయి గ్రామంలో జన్మించారు.  తల్లిదండ్రులు మూర్తి దేవి, సుఘార్‌ సింగ్‌లు. పేద కుటుంబం అయినప్పటికీ కష్టపడి బాగా చదువుకుని పైకొచ్చారు ములాయం.  

 ములాయం సోదరి కమలా దేవి, శివపాల్‌ సింగ్‌ యాదవ్‌, రతన్‌సింగ్ యాదవ్‌, అభయ్‌ రామ్‌ యాదవ్‌, రాజ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ సోదరులు. దగ్గరి బంధువు రామ్‌ గోపాల్‌యాదవ్‌ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. 

 ములాయం చదివింది ఎంఏ. సోషలిస్ట్‌ మూమెంట్‌లో, రాజకీయాల్లో చేరకముందు మెయిన్‌పురిలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు చెపారు ములాయం.

సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, కీలక నేతలు అంతా ములాయంను నేతాజీ( గౌరవ నేత) అని పిలుస్తుంటారు. ఎప్పుడైతే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి దూరం అయ్యారో.. అప్పటి నుంచి అఖిలేష్‌కు ఆ పిలుపు సొంతం అవుతుందని అంతా అనుకున్నారు.  కానీ, ఎస్పీ నుంచి ఆ గౌరవం అందుకునే అర్హత ఒక్క ములాయంకే పార్టీ శ్రేణులు బలంగా ఫిక్స్‌ అయిపోయాయి.

ప్రొఫెషనల్‌ రెజ్లర్‌
ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రొఫెషనల్‌ కుస్తీ వీరుడు కూడా. రాజకీయాలు ఛాయిస్‌ కాకుంటే ఆయన మల్లు యుద్ధవీరుడిగా గుర్తింపు దక్కించుకునేవారేమో. మెయిన్‌పురిలో ఓసారి జరిగిన కుస్తీ పోటీల్లో కుర్రాడిగా ములాయం పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నాథూ సింగ్‌.. ములాయం కుస్తీ పట్లకు ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత జస్వంత్‌ నగర్‌ సీటును ములాయంకు ఇప్పిదామని నాథు సింగ్‌ ప్రయత్నాలు చేసినా అది ఎందుకనో కుదర్లేదు. ఇక ములాయంను ముద్దుగా పహిల్వాన్‌ అని పిలుస్తుంటారు.

రెండు వివాహాలు.. 
ములాయం సింగ్‌ యాదవ్‌కు రెండు వివాహాలు జరిగాయి. మొదటి వివాహం మాలతీ దేవి. వీరికి అఖిలేష్‌ యాదవ్‌ సంతానం. దీర్ఘకాలిక సమస్యలతో 2003లో మాలతీ దేవి కన్నుమూశారు. 

మొదటి భార్య బతికున్న సమయంలో.. 1980 సమయంలో సాధనా గుప్తాతో ఆయన సహజీవనం కొనసాగించారు. వీళ్లకు ప్రతీక్‌ యాదవ్‌ అనే కొడుకు ఉన్నాడు. 2007 ఫిబ్రవరిలో ములాయం చెప్పేదాకా వీళ్లిద్దరికీ వివాహం అయ్యిందనే విషయం ఈ సమాజానికి తెలియలేదు. జులై 9, 2022న సాధనా గుప్తా అనారోగ్యంతో కన్నుమూశారు. 

రాజకీయాలు ఇలా.. 
చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. రామ్‌ మనోహర్‌ లోహియా ఆదర్శాలతో ఇటుగా అడుగులేశారు. పదిహేనేళ్ల వయసులో ములాయం.. జానేశ్వర్‌ మిశ్రా, రామ్‌ సేవక్‌ యాదవ్‌, కర్పూరీ థాకూర్‌.. ఇలా ఎందరినో కలిశారు. 

► 1960లో జనతా దళ్‌లో చేరారు ములాయం. 1962లో ములాయం.. షికోహాబాద్‌లోని ఏకే కాలేజీ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 

 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1977ల తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్‌ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో ఏకంగా జనతా దళ్‌కు జాతీయాధ్యక్షుడు అయ్యాడు.

 1982లో యూపీ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లపాటు అలా ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1985లో జనతా దల్‌ చీలిపోయాక.. చంద్ర శేఖర్‌, సీపీఐలతో కలిసి క్రాంతికారి మోర్చాను స్థాపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలోనే 1989లో తొలిసారి ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారాయన. 

► 1990లో వీపీ సింగ్‌ ప్రభుత్వం కుప్పకూలాక.. చంద్ర శేఖర్‌ జనతా దల్‌(సోషలిస్ట్‌)లో చేరారు ములాయం. కాంగ్రెస్‌, జనతా దల్‌ మద్దతుతో సీఎంగా కొనసాగారు. 

 1991 ఏప్రిల్‌లో.. కాంగ్రెస్‌ తన మద్దతు ఉపసంహరించుకోగా.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ములాయం.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. 

 ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్సీ)తో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 

 ఆపై దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర కొనసాగింది. పార్లమెంటేరియన్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. అదే సమయంలో(1996లో) మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ములాయం. దీంతో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ములాయం సింగ్‌ యాదవ్ బాధ్యతలు చేపట్టారు.

► అయితే.. 1998లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయన రక్షణ మంత్రి కోల్పోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంభల్‌, కన్నౌజ్‌ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో నెగ్గారు ఆయన. అయితే తనయుడు అఖిలేష్‌ కోసం కన్నౌజ్‌ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

 2003, సెప్టెంబర్‌లో తిరిగి.. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయానికి ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో.. గున్నావుర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. రికార్డు స్థాయి బంపర్‌మెజార్టీతో 2004 జనవరిలో గెలిచారాయన. ఆ ఎన్నికల్లో 94 శాతం ఓటింగ్‌ నమోదు కావడం గమనార్హం. 

అందుకే సైకిల్‌ సింబల్‌!
పేద కుటుంబంలో పుట్టిన ములాయంకు.. చిన్నప్పుడు సైకిల్‌ నడపాలనే కోరిక విపరీతంగా ఉండేదట. కానీ, తండ్రి సంపాదన తక్కువగా ఉండడంతో ఆ స్తోమత లేక చాలా కాలం ఆ కోరిక తీరలేదు. ఇక కొంచెం సంపాదన వచ్చాక.. అద్దె సైకిల్‌తో ఇరుగు పొరుగు ఊర్లకు వెళ్తూ సరదా తీర్చుకున్నారాయన. ఎప్పుడైతే.. సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించారో.. అప్పుడే తన పార్టీకి సైకిల్‌ గుర్తుగా ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్‌ అయిపోయారట.

► తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ ప్రస్తుతం సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012-17 మధ్య అఖిలేశ్ యాదవ్‌ యూపీ సీఎంగా వ్యవహరించారు.

 ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. మొత్తం జీవిత కాలంలో వివిధ రకాల ఉద్యమాలు, ఇతరత్రాలతో తొమ్మిసార్లు జైలుకు వెళ్లారు.

వివాదాలు.. 

► అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందు.. తరువాత జరిగిన పరిణామాలు ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయ జీవితాన్ని కీలక మలుపులు తిప్పాయి. 

 2012 నిర్భయ ఘటనపై స్పందించే క్రమంలో ములాయం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మగాళ్లు అన్నాక తప్పులు చేయడం సహజమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఐరాస సెక్రెటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ సైతం స్పందించారు. ఇక ములాయం చేఏసిన వ్యాఖ్యలకు మోహాబా జిల్లా కోర్టు ఆయనకు సమన్లు సైతం జారీ చేసింది. 

 టిబెట్‌ సార్వభౌమాధికారం కోసం చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. 

► ఇక ములాయం పెద్ద కొడుకు అఖిలేష్‌ యాదవ్‌ 2012లో యూపీ సీఎం అయ్యాక.. కుటుంబ కలహాలు బయటపడ్డాయి. సోదరుడు శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ వేరు కుంపటితో వివాదం రచ్చకెక్కింది. ఒక గ్రూప్‌కు అఖిలేష్‌, రామ్‌ గోపాల్‌ యాదవ్‌ నేతృత్వం వహించగా.. మరో గ్రూప్‌నకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్‌ యాదవ్‌లు, అమర్‌ సింగ్‌లు నేతృత్వం వహించారు. 

 తండ్రికి ఎదురు తిరిగేలా అఖిలేష్‌ నిర్ణయాలు తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. చివరికి.. 2016 డిసెంబర్‌ 30న ఏకంగా కొడుకు అఖిలేష్‌, బంధువు రామ్‌ గోపాల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అయితే.. 24 గంట్లోలనే ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ.. 

 దానికి బదులుగా తన తండ్రికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ.. తనను తాను పార్టీ చీఫ్‌గా ప్రకటించుకున్నారు. ఈ మేరకు జనవరి 1, 2017 నిర్వహించిన జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ములాయం బహిరంగంగా ఖండించారు. అయితే..  ఎన్నికల సంఘం కూడా అఖిలేష్‌ నిర్ణయానికి మద్దతుగా.. ములాయం ఆదేశాలను తప్పుబట్టడంతో.. అప్పటి నుంచి అఖిలేష్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ నేతగా కొనసాగుతూ వస్తున్నారు. 

ములాయం సింగ్‌ యాదవ్‌ మీద 2021లో డైరెక్టర్‌ సువేందు రాజ్‌ ఘోష్‌ ‘మెయిన్‌ ములాయం సింగ్‌ యాదవ్‌’ అనే చిత్రాన్ని తీశాడు. అమిత్‌ సేథీ ఇందులో ములాయం పాత్రలో కనిపించారు. ఇక 2019లో  విజయ్‌ గుట్టే డైరెక్ట్‌ చేసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రంలో సుభాష్‌ త్యాగి, ములాయం సింగ్‌ యాదవ్ పాత్రలో కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement