
సంగారెడ్డి: బీజేపీ తొలి జాబితా ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది. ప్రధానంగా పటాన్‌చెరు, నర్సాపూర్ అభ్యర్థుల ప్రకటనపై పలువురు పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభ్యర్థిత్వాల ఎంపిక విషయమై కొన్ని రోజులుగా కసరత్తు చేసిన అధినాయకత్వం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నలుగురిని ఖరారు చేసింది.
దుబ్బాకకు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందర్‌రావు, గజ్వేల్‌కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పటాన్‌చెరుకు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, నర్సాపూర్‌కు మురళీయాదవ్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఇందులో పటాన్‌చెరు, నర్సాపూర్ అభ్యర్థుల ఎంపికపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
పటాన్‌చెరులో తిరుగుబావుట..
పటాన్‌చెరు టికెట్ నందీశ్వర్ గౌడ్‌కు ప్రకటించగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇస్నాపూర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో అసంతృప్త నేతలంతా సమావేశమయ్యారు. ఎనిమిది మంది పార్టీ మండల అధ్యక్షులు, కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు, మున్సిపాలిటీల అధ్యక్షులంతా హాజరయ్యారు. ఈ టికెట్ విషయమై అధినాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
ఆయనను ఎట్టి పరిస్థితుల్లో మార్చాలని కోరారు. పూటకో పార్టీ మారుతూ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలపై పెత్తనం చెలాయిస్తున్న వ్యక్తిని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కాగా ఈ టికెట్‌ను నందీశ్వర్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్, పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు ఎడ్ల రమేష్ సైతం ఆశించారు.
స్వతంత్రంగా బరిలోకి దిగే యోచనలో గోదావరి అంజిరెడ్డి
పటాన్‌చెరు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసిన గోదావరి అంజిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ టికెట్ విషమయై ఆమె అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అధినాయకత్వం మాత్రం నందీశ్వర్ గౌడ్ వైపే మొగ్గు చూపింది.
నర్సాపూర్‌లోనూ..
మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళీయాదవ్‌కు నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపైనా అసమ్మతి సెగలు రేగుతున్నాయి. ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని ఆశావహులైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శింగాయపల్లి గోపీ, నాయకులు రఘువీరారెడ్డి తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడిన వ్యక్తి అభ్యర్థిత్వం ఎలా ఖరారు చేస్తారని అసమ్మతి నేతలు ప్రశ్నించారు. అధినాయకత్వం ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా తొలి విడత అభ్యర్థుల ప్రకటనతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కమలం పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి.