ఈ కార్డులోనే విద్యార్థుల సమగ్ర సమాచారం
తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి
కేజీటు పీజీ వరకు 12 అంకెలతో ఐడీ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆధార్ కార్డు తరహాలోనే ఇక ముందు విద్యార్థులకు అపార్ కార్డులు రానున్నాయి. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్లినా.. ఉపకార వేతనాలు రావాలన్నా అపార్ కార్డు ఉండాల్సిందే. కేంద్రం జాతీయ విద్యావిధానంలో భాగంగా ఆధార్ తరహాలోనే వన్ నేషన్ స్టూడెంట్ పేరిట ప్రభుత్వ , ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేజీ టు పీజీ వరకు దేశంలోని ప్రతి విద్యార్థికి 12 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక ఐడీని అపార్ (ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కేటాయించనున్నారు. ఇది దేశంలో ప్రతి విద్యార్థికి అందించే గుర్తింపు నంబర్. ఇప్పటికే విద్యార్థి వివరాలు యూ డైస్ ప్లస్‌లో నమోదు చేసిన నేపథ్యంలో అందులోనే తల్లిదండ్రులు సూచించిన సవరణలు చేసి ఆన్‌లైన్‌లో అపార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ అనుసంధానమైన చరవాణికి ఓటీపీ వచ్చిన తర్వాత గుర్తింపు నంబర్ జారీ అవుతుంది. ఒకసారి ఆన్‌లైన్‌లో కార్డు వెలువడిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు.
జిల్లాలో 1423 పాఠశాలలు
జిల్లా వ్యాప్తంగా 1,423 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథఽమిక పాఠశాలలు 862, ప్రాథమికోన్నత 191, ఉన్నత పాఠశాలలు 205, కస్తూర్బాలు 20, ఆదర్శ పాఠశాలలు 10, గురుకుల పాఠశాలలు 46, ప్రైవేట్ పాఠశాలలు 442 ఉన్నాయి. వాటిలో 50 లక్షలకు పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలో చైల్డ్ ఇన్‌ఫో ద్వారా ఒక ఐడీ, కళాశాల స్థాయిలో మరో ఐడీ ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా అందించే అపార్ కార్డులోనే అన్ని వివరాలు పొందు పరిచి ఉండనున్నాయి. అపార్ కార్డును జీవిత కాలం ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి కి సంబంధించిన పేరు, వయస్సు, లింగం, క్యూ ఆర్ కోడ్,తో పాటు, విద్యార్థి సాధించిన విజయాలు, ఉపకార వేతనాలు, మెమోలు, ధ్రువపత్రాలు, దీనికి ఆధార్ కార్డు కూడా అనుసంధానం ఉండటంతో కుటుంబ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో నంబర్ లేదా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి.
ఇవీ ప్రయోజనాలు
అపార్ కార్డు విద్యార్థి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. అలాగే..విద్యార్థి బ్యాంక్ ఖాతా డీజీ లాకర్‌తో అనుసంధానమై ఉంటుంది. విద్యా సంస్థలలో ఒక చోట నుంచి మరోచోటుకు ప్రవేశాల నిమిత్తం వెళ్లినప్పుడు, ప్రవేశ పరీక్షల్లో వివరాల నమోదులో ధ్రువీకరణ సులభంగా అవుతుంది. ఉపకార వేతనాలు, ఉద్యోగాల భర్తీ సమయంతో పాటు చాలా సందర్భాలలో అపార్ కార్డు కీలకం కానుంది. సర్టిఫికెట్‌లు పోతే కూడా డీజీ లాకర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అపార్ కార్డే కీలకం
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ నేపథ్యంలో అపార్ కార్డును తీసుకొచ్చింది. ఆధార్ తరహాలోనే భవిష్యత్‌లో విద్యార్థులకు అపార్ కార్డే కీలకం కానుంది. ఈ కార్డులో విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అపార్‌కార్డుకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. వేరే పాఠశాలలకు వెళ్లాలన్నా, పై చదువులకు కూడా ఈ అపార్‌కార్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
–వెంకటేశం, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment