విల్లాసవంతం ఏదీ..?
రామచంద్రాపురం (పటాన్‌చెరు): గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం, తాగునీరు, ట్రాఫిక్ తదితర సమస్యలకు దూరంగా.. ప్రశాంత జీవితం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసిన ఉద్యోగులు, వ్యాపారాస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. విల్లాలు కొన్నామన్న సంతృప్తి, సంతోషం లేక విలవిల్లాడి పోతున్నారు. వారికి ప్రశాంత జీవనం కరువైంది. తాము ప్రభుత్వానికి వేల రూపాయల పన్ను చెల్లిస్తున్నా కనీస సదుపాయాలు కల్పించడం లేదని, సమస్య పరిష్కారం కోసం ప్రతిసారి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారు వాపోతున్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సుమారు 50పైగా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు ఉన్నాయి. అందులో అధికారిక లెక్కల ప్రకారం 60 వేలకు పైగా జనాభా ఉండగా.. అనధికార లెక్కల ప్రకారం సుమారు 2లక్షపై జనాభా ఉంది. అయితే.. జనాభాకు సరిపడా మౌలిక సదుపాయలు కల్పించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలం చెందారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు లేక ఇబ్బందులే..
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డు నుంచి తెల్లాపూర్ మీదగా గోపనపల్లి వరకు రేడియల్ నిర్మించి పదేళ్లు పూర్తి కావస్తున్నా.. నేటికి ఆ రోడ్డు అసంపూర్తిగానే ఉంది. దీనితో పాటు అన్ని ఇంటర్నల్ రోడ్లను అభివృద్ధి చేయాలని స్థానికులు పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులను కేటాయించామని ఆధికారులు చెబుతున్నారే తప్ప అమలు చేయడం లేదు. నిత్యం రోడ్లపై భారీ వాహనాల రాకపోకలతో రోడ్లపై దుమ్ము, ధూళితో వాయుకాలుష్యానికి దారి తీస్తుంది. అలాగే.. జనాభాకు సరిపడా ప్రభుత్వాస్పత్రి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు పెరుగుతున్నా వాటికి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చెరువులోకి డ్రైనేజీ నీరు చేరుతుంది.
తప్పని తాగునీటి సమస్య
కాలనీలకు తాగునీటి అందించడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందారు. రిజర్వాయర్ నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం లేదు. తాగునీటి సరఫరా కోసం డెవలప్‌మెంట్ పేరిట లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలను గాలికొదిలేసిన అధికారులు పార్కులపై దృష్టి సారించారని స్థానికులు విమర్శిస్తున్నారు.
పట్టించుకోవడంలేదు
ప్రత్యేక అధికారుల పాలనలో సైతం ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదు. అధికారులు వారి సొంత లాభాలపైనే దృష్టి పెడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలు ఉండగా.. కోట్లాది రూపాయలతో పార్కుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా సమాధానం ఇవ్వడంలేదు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కనీసం విజిలెన్స్ అధికారులు విచారణ జరపాలి.
– ఈశ్వరిగారి రమణ, తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలను పట్టించుకోవడం లేదు. వెంటనే సమస్యలను పరిష్కరించాలి.
– కొల్లూరి భరత్, మాజీ కౌన్సిలర్
రూ.కోట్లు వెచ్చించి విల్లాలు కొన్నా..
తప్పని ఇబ్బందులు
మౌలిక సదుపాయాలు లేక సతమతం
వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా అభివృద్ధి పట్టదా..?
గేటెడ్ కమ్యూనిటీవాసుల ఆవేదన
విల్లాసవంతం ఏదీ..?
విల్లాసవంతం ఏదీ..?
Comments
Please login to add a commentAdd a comment