
భరోసా పనితీరు భేష్
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: భరోసా కేంద్రంలోని సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు. విధుల్లోగానీ, వ్యక్తిగతంగా గానీ ఎలాంటి సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చని స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని భరోసా కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు అందించిన సేవలను, నిర్వహించిన కౌన్సిలింగ్, భరోసా సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో కౌన్సిలింగ్ రూమ్, మెడికల్ రూమ్, లీగల్ సపోర్టింగ్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్ లలో కలియతిరిగారు. అనంతరం కార్యాలయం రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...భరోసా కేంద్రం సిబ్బంది బాధిత మహిళలకు వెన్నంటి ఉండి వారికి అసరమైన మెడికో లీగల్ సేవలు సత్వరమే అందించాలన్నారు. అవసరమైన కేసులలో భరోసా సిబ్బంది బాధిత మహిళల ఇళ్లను సందర్శించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. మహిళా సంబంధిత నేరాల గురించి వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, భరోసా కో–ఆర్డినేటర్ దేవలక్ష్మి, భరోసా సిబ్బంది తదితరులున్నారు.