
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా: ఎస్పీ
నారాయణఖేడ్: సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టంగా ఉండాలని ఎస్పీ పంకజ్ పారితోష్ సూచించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి మనూరు, నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్లను ఎస్పీ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్‌స్టేషన్లలో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. లాకప్ గదులను పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అయినందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిరోధంపై కఠినంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకట్‌రెడ్డి, నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో కోరారు. స్వయం ఉపాధి పథకానికి ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. పథకం ద్వారా గరిష్టంగా రూ.4 లక్షల వరకు రుణం అందించినట్లు తెలిపారు. తీసుకున్న రుణంలో 60 నుంచి 80శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు ఆధార్ కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఏదో ఒక అంశాలలో ఎన్నుకొని స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
రైతు రిజిస్ట్రీ అమలు
పైలెట్ ప్రాజెక్టు కింద
మొగుడంపల్లి ఎంపిక
జహీరాబాద్ టౌన్: రైతు రిజిస్ట్రీ అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద మొగుడంపల్లి మండలాన్ని ఎంపిక చేసినట్లు వ్యవసాయశాఖ ఏడీఏ భిక్షపతి అన్నారు. మొగుడంపల్లి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగా ప్రతీ రైతుకు 11 నంబర్లతో యూనిక్‌కోడ్ (యూసీ)కేటాయించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమన్యా వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తామని, దీని ద్వారా ఈ ఫార్మర్ ఐడీని కేటాయిస్తామన్నారు. రైతులు వ్యవసాయ విస్తీరణ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు.
హ్యాట్రిక్ కొట్టాడు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
సాధించిన సాయికిరణ్‌రెడ్డి
జహీరాబాద్/న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రస్తు తం ఆధునిక పోటీ ప్రపంచంలో ఒక ప్రైవేట్ ఉద్యోగం సాధించడం అంత సులువైంది కాదు. అందులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అహర్నిశలు కష్టపడి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరి ఓపెన్ కాంపిటేషన్‌లో ఉద్యోగం సాధించాలంటే ఎంత శ్రమకోర్చి చదవాలో అది కష్టపడే వారికే తెలుస్తుంది. కానీ న్యాల్‌కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన యువకుడు నాగారం సాయికిరణ్‌రెడ్డి(25) ఓపెన్ కాంపిటేషన్‌లో పోటీపడి ఏడాది కాలంలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షలో జిల్లాలో మూడవ ర్యాంకు సాధించగా, ఆయనకు మొదటగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం ఆయన సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే విధంగా ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ల కోసం ప్రభుత్వ పోటీ పరీక్షలు నిర్వహించగా అందులో రాష్ట్రంలో 14వ ర్యాంకు రాగా మెరిట్ కోటాలో ఉద్యోగం సంపాదించాడు. అలాగే గ్రూప్–2 పరీక్షలో రాష్ట్రంలో 75వ ర్యాంకు రాగా, మెరిట్ కోటాలో ఉద్యోగం సాధించి సాయికిరణ్‌రెడ్డి తన సత్తాను చాటాడు. ఏడాది కాలంలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తి నింపుతున్నాడు.

సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా: ఎస్పీ