● లక్షలు ఖర్చు పెట్టి సాగు ● తీవ్రంగా నష్టపోతున్న రైతులు ● దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ● అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకోలు
జహీరాబాద్ టౌన్: అడవి పందుల బెడద రోజు రోజుకు అధికమవుతోంది. చేతికి వచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో పాటు మనుషులపై దాడులు చేయడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగలు సైతం రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. రైతులు సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం సేద్యం చేసి, లక్షల పెట్టుబడి పెట్టి పండిస్తున్న అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. విత్తనం నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతన్నలకు అడవి పందులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జహీరాబాద్ వ్యవసాయ డివిజన్‌లో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో అధికశాతం చెరకు, మొక్కజొన్న, జొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు సాగు చేస్తున్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మరో వైపు పంటలకు అడవి పందులు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో అవి దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. తదితర పంటలను కొరికి నేలపాలు చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు.