
టీచర్ అసభ్యకర ప్రవర్తనపై విచారణ
పాపన్నపేట(మెదక్): మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా టీచర్‌పై తోటి టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని వచ్చిన ఆరోపణలపై పాపన్నపేట ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాస్‌రావు గురువారం విచారణ జరిపారు. డీఈఓ రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు విచారణ జరిపి స్థానిక హెచ్‌ఎం, టీచర్లు, మధ్యాహ్న భోజన ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మహిళల నుంచి లిఖిత పూర్వ వివరణ తీసుకున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వివరించారు.
ఆల్ ఇండియా క్రీడా పోటీలకు కోహెడ యువకుడు
కోహెడ(హుస్నాబాద్): ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలకు ఎంపికై నట్లు కోహెడ మండల కేంద్రానికి చెందిన యువకుడు హరిప్రసాద్ తెలిపారు. గురువారం యువకుడు మాట్లాడుతూ.. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. టగ్ ఆఫ్ వార్ క్రీడలో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు 5 నుంచి 9 వరకు పంజాబ్‌లోని లమ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీలో జరుగనున్నట్లు తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూల్ కోహెడ ప్రిన్సిపాల్ కె.నరేందర్‌రెడ్డి ప్రోత్సాహంగా తనకు రూ.10 వేలు అందించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కనీస వేతనం చెల్లించాలి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి
సిద్దిపేటఅర్బన్: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై గోపాలస్వామి మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తామని, అర్హత కలిగిన వారిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు నెల నెలా ఇవ్వడం లేదని విమర్శించారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 7న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 19 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్‌కుమార్, జిల్లా నాయకులు ప్రభాకర్, రాజమౌళి, కనకయ్య, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
దుబ్బాకరూరల్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని హబ్సిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజ్ కథనం మేరకు.. కొక్కడగల్ల భాగ్యమ్మ(45) కొద్దిరోజుల కిందట భర్త చెందగా, కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులుండగా సిద్దిపేటలో పని చేస్తున్నారు. భాగ్యమ్మ తమ్ముడు పరమేశ్వర్ బుధవారం రాత్రి వచ్చి ఆమెతో మాట్లాడిచ్చి తిరిగి ఇంటికి వెళ్లి పోయాడు. పరమేశ్వర్ గురువారం ఉదయం వచ్చి చూసే సరికి భాగ్యమ్మ అన్నం తింటూ కూర్చున్న చోటే చనిపోయి ఉంది. చుట్టు పక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టీచర్ అసభ్యకర ప్రవర్తనపై విచారణ