
వేర్వేరు ఘటనల్లో నలుగురు ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
ఉరేసుకొని వ్యక్తి...
దుబ్బాకటౌన్: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్ మండలం రామారంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కొమ్మాయిపల్లి రామస్వామి (40) ఆరు నెలల కింద పక్షవాతానికి గురయ్యాడు. వైద్యం చేయించుకున్నప్పటికీ పూర్తిగా తగ్గలేదు. దీంతో పక్షవాతం తగ్గడం లేదన్న మనోవేదనకు గురయ్యేవాడు. ఆదివారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో వారికి చెప్పి వెళ్లాడు. పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల రైతులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘుపతి తెలిపారు.
మద్యం మత్తులో...
తొగుట(దుబ్బాక): మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బంజేరుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానివేయాలని భార్య సరిత పలుమార్లు వారించినా వినిపించుకోలేదు. రోజూ మాదిరిగా ఉదయం సరిత గ్రామంలో కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి భర్త ఉరేసుకున్నాడు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో ఆయనను కిందకి దించిచూడగా అప్పటికే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడు, కూతురు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు.
మద్యానికి బానిసై...
సిద్దిపేటరూరల్: మద్యానికి బానిసై అప్పులపాలై ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని చింతమడక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పెద్దెల్లి నర్సిహులు(38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాగుడుకు బానిసై గ్రామంలో అప్పులు చేశాడు. దీంతో శనివారం ఉదయం భార్య విజయలక్ష్మి తాగుడు మానేయమంటూ భర్తను నిలదీయడంతో అప్పులు చేసిన నేనే అప్పులు తీర్చుతానంటూ కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా అతడు ఇంటికి రాలేదు. దీంతో విజయలక్ష్మి మరిది యాదగిరిని బావి వద్దకు వెళ్లి చూడాలని చెప్పింది. అక్కడికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఇంటికీ ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూసేసరికి అప్పటికే చనిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డీజిల్ పోసుకొని మహిళ...
సిద్దిపేటకమాన్: మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం కాలనీలో వటారికారి సాయికుమార్ తన తల్లి గాయత్రి (55)తో కలిసి నివాసం ఉంటున్నాడు. సాయికుమార్ పట్టణంలో ఫుట్‌వేర్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గాయత్రి భర్త ఏనిమిదేళ్ల క్రితం మృతి చెందడంతో అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగా లేదు. దీంతో హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స అందించి ప్రస్తుతం మందులు వాడుతున్నారు. ఆదివారం రోజు మాదిరిగానే సాయికుమార్ షాప్‌నకు వెళ్లగా గాయత్రి ఇంట్లో డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న సాయికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని చూడగా తన తల్లి మృతి చెంది ఉంది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.