
ప్రాణాలు తీస్తున్న సరదా
పండుగ పూట విషాదం
ఈత సరదా యువకుల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో కేవలం ఆరునెలల వ్యవధిలో పాతికేళ్లలోపు యువకులు నలుగురు మృత్యువాత పడ్డారు. గతంలో మంజీరా నదిలో ఇద్దరు.. తాజాగా శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడిలో మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
–మెదక్‌జోన్
అందరూ పాతికేళ్లలోపు వారే..
అయితే బొల్లారం మత్తడి మెదక్ మండలంలోని పలు గ్రామాలకు సమీపంగా ఉంటుంది. ఇందులోకి ఘనపూర్ ఆనకట్ట నుంచి నీరు వచ్చి చేరటంతో మండు వేసవిలో నిండుకుండలా మారుతుంది. దీంతో యువత అందులోకి ఈత కోసం వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు ఈ మత్తడి నలుగురు యువకులను బలి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో జానకంపల్లికి చెందిన యువకుడు మిత్రులతో కలిసి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతిచెందాడు. అలాగే తిమ్మక్కపల్లికి చెందిన మరో యువకుడు మత్తడిలో మునిగి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. అలాగే ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం సమీపంలో మంజీరా నది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది. భక్తులు ముందుగా మంజీరా పాయల్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే గత నెల 1వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఏడుపాయలకు వచ్చి మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. అందులో ఇద్దరు యువకులు పోతంశెట్‌పల్లి 2వ బ్రిడ్జి వద్ద నదిలో ఈతకు దిగి నీటమునిగి దుర్మరణం చెందారు. మంజీరాలో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు రాళ్లు రప్పలతో నిండి ఉంది. ఈ ప్రదేశంలోనికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్కడ నిరంతరం పోలీస్ సిబ్బందిని ఉంచితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.
ఈతకు వెళ్లి కానరాని లోకాలకు..
మెదక్ మండలం బాలనగర్‌కు చెందిన తుండు అనిల్ (17), తుండుం నవీన్ (25) శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడికి ఈతకు వెళ్తున్నా మని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు మత్తడి వద్దకు వెళ్లి చూడగా గడ్డపై ఇద్దరి దుస్తులు, చెప్పులు కనిపించారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా ఆదివారం మధ్యా హ్నం ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామానికి చెందిన తుండుం లలిత, పద్మయ్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా కూతురు పెళ్లిచేయగా.. అనిల్ పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్ద తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే చేతికందివచ్చిన కొడుకు నీటి మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే గ్రామానికి చెందిన తుడుం బాలయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నీట మునిగి మృతిచెందిన నవీన్ (25) రెండో కుమారుడు. అతడికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. భర్త నీటి మునిగి చనిపోయాడని తెలియటంతో ఆమె రోదనలు మిన్నంటాయి.
ఆరునెలల వ్యవధిలో నలుగురు మృత్యువాత
కుటుంబాలకు తీరని వ్యథ
నీటి వనరుల వద్ద కానరాని భద్రతా చర్యలు

ప్రాణాలు తీస్తున్న సరదా

ప్రాణాలు తీస్తున్న సరదా

ప్రాణాలు తీస్తున్న సరదా