సంగారెడ్డిలో మూతపడిన ఫీల్ ది జైల్
సంగారెడ్డి టౌన్: జైలు.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఖైదీలు. తెల్లని చొక్కా, దాని మీద నెంబరు.. తెల్ల నిక్కర్.. తెల్ల టోపీ. అయితే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే వారికోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ‘ఫీల్ ది జైల్’ పేరుతో సంగారెడ్డిలో ప్రత్యేక కారాగారం ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటి మ్యూజియం, జైలు కూడా ఇదే.
నిజాం కాలంలో..
నిజాం కాలంలో మొదట సంగారెడ్డి జైలు ఏరియాలో గుర్రపుశాల నిర్మించారు. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అదే ఏరియాలో 1.5 ఎకరాల్లో జైలు ఏర్పాటు చేశారు. ఇందులో పదుల సంఖ్యలో బ్యారక్‌లు ఉన్నాయి. ఒక్కోదానికి తెలంగాణ, మొఘల్, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనల పెయింటింగ్ వేయించారు. బ్రిటీష్ కాలం నాటి ఫొటోలు కూడా గదుల్లో ఏర్పాటు చేయించారు. టైపు రైటర్లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్ క్లాక్ లు, గంటలు.. ఇలా ప్రతీ వస్తువు ప్రదర్శన కోసం ఉంచారు.
జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి..
జైలు మ్యూజియమే కాదు.. జైలు జీవితాన్ని అనుభవించాలనుకునేవారికి అధికారులు సంగారెడ్డి జైలులో అవకాశం కల్పించారు. ఇందుకోసం రోజుకు రూ. 500 చెల్లించాలి. వారికి సాధారణ ఖైదీలాగే ఖాదీ దుస్తులు, చొక్కా, నిక్కర్ లేదా ప్యాంట్, ప్లేట్, గ్లాస్, మగ్గు, సబ్బు, మంచి భోజనం, నిద్రించేందుకు దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. టీ, టిఫిన్ ఇచ్చేవారు. యోగా, క్రమశిక్షణ నేర్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచేవారు. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరిగేవి. జాతిరత్నాలు సినిమాతో పాటు ఇతర సినిమాల్లో జైళ్ల్ల సీన్ల షుటింగ్ కూడా ఇక్కడే జరిగాయి.
ఉదయం 6.30 నుంచే..
ఉదయం 6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉండేది. 7.30 గంటలకు టీతో పాటు టిఫిన్, తర్వాత పరేడ్ 8 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం ఉండేది. 9.30 గంటలకు మ్యూజియం సూపర్‌వైజర్ రౌండ్‌కు వచ్చేవారు. ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డించేవారు. 11 గంటల నుంచి తిరిగి విద్యాదానం కొనసాగేది.
మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి. 1.30 నుంచి సాయంత్రం 4 గంట ల వరకు కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవ గాహన కల్పించేవారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేయడం వంటి ట్రైనింగ్ ఉండేది. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత 6 గంటలకు లాకప్‌లో ఉంచేవారు.
ఇలా ఇక్కడ సుమారు 50 మంది వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఇదంతా గతం. కరోనా ఎఫెక్ట్‌తో జైలు మూతబడింది. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలకు కాంపౌండ్ వాల్ పడిపోయింది. ప్రభుత్వం స్పందించి ఫీల్ ది జైల్‌ను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఫీల్ ది జైల్ ప్రారంభించాలి
శిథిలమైన ఫీల్ ది జైల్‌కు రిపేర్ చేయించాలి. పర్యాటకశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలి. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి అవకాశం కల్పించాలి. ఈతరం వారికి జైలు అంటే ఎలా ఉంటుందో తెలియజేయాలి.
– అఖిల్ యాదవ్, సంగారెడ్డి
ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి
సంగారెడ్డిలోని మ్యూజియం జైలును పునరుద్ధరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. జైలు జీవితంపై యువతకు అవగాహన కల్పించాలి. చెడుమార్గంలో నడవకుండా, నిజజీవితంలో జైలు జీవితమంటే ఎంత నరకమో తెలియజేయాలి.
– కూన వేణు, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment