
ఉద్యోగ విరమణ ఫలమేదీ?
ప్రాజెక్ట్ టీచర్లు ఆయాలు
దుబ్బాక 02 13
సిద్దిపేట 0 24
చేర్యాల 01 18
హుస్నాబాద్ 05 13
గజ్వేల్ 04 22
● అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఎదురు చూపులు
● 9 నెలలుగా ప్రయోజనాలు అందక అవస్థలు
● జిల్లాలో రిటైర్డు అయిన 12 మంది టీచర్లు, 90 మంది ఆయాలు
అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ పొందారు.. కానీ నేటికీ ప్రయోజనాలు అందలేదు. 65 ఏళ్లు నిండిన వారిని ప్రభుత్వం పదవీ విరమణ ప్రకటించింది. అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, ఆయాకు రూ.లక్ష చొప్పున ఇస్తామని తెలిపింది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలదే ముఖ్య పాత్ర. గతంలో వీరికి ఉద్యోగ విరమణ గడువు ఉండేది కాదు. కానీ గతేడాది జూన్ 30వ తేదీకి 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు మొత్తం 102 మంది ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సాక్షి, సిద్దిపేట: అంగన్ వాడీ టీచర్లు, ఆయాల్లో కొందరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించారు. 1985లో విధుల్లో చేరిన వారు గతేడాది జూన్30న ఉద్యోగ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాల కాలంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారు వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బూత్‌లెవల్ అధికారిగా, పల్స్ పోలియో, వివిధ సర్వేలను విజయవంతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ప్రతి చిన్న కార్యక్రమానికి వారిని వినియోగించారు. పదవీ విరమణ పొంది 9నెలలు గడిచినా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్యోగికై నా ఉద్యోగ విరమణ తర్వాత ఎంతో కొంత డబ్బులు వస్తే వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుంది. టీచర్. ఆయాగా విధులు నిర్వర్తించినప్పుడు నెల నెల జీతం వచ్చేది. పదవీ విరమణ డబ్బులైనా వస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని వాపోతున్నారు.
ఇదేనా గుర్తింపు?
నాలుగు దశాబ్దాల పాటు చిన్నారులు. బాలింతలు, గర్భిణులు సేవలందించిన వారికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని అంగన్ వాడీ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్లను వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పదవీ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్లకు పింఛన్ నెలకు రూ. 6వేలు, ఆయాలకు రూ. 4వేలు అందించాలని యూనియన్ నాయకులు విన్నవించారు.. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ ఇప్పించాలని రిటైర్డ్ అయిన టీచర్లు, ఆయాలు కోరుతున్నారు.