
బాబోయ్ బర్డ్ ఫ్లూ
ప్రజలకు వైద్య పరీక్షలు
బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫాం పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కోళ్ల నుంచి వ్యాధి ప్రజలకు సోకే అవకాశం ఉండటం వల్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాల్ట్రీ ఫాం పరిసరాలకు ఎవరూ వెళ్లకుండా అక్కడ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు.
సామూహికంగా కోళ్ల పూడ్చివేత
కాన్గల్ గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అవ్వడంతో ఆ పౌల్ట్రీ ఫాంలోని 1.45లక్షల కోళ్లను అధికారులు చంపి పూడ్చిపెడుతున్నారు. బుధవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. వారం రోజుల పాటు కొనసాగనుంది. బర్డ్‌ఫ్లూ సోకిన పౌల్ట్రీఫాంకు కిలోమీటర్ దూరంలో చికెన్, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. దీంతో పాటు వ్యాధి సోకిన ఫామ్‌కు కిలోమీటర్ సమీపంలోని పౌల్ట్రీ ఫాంలపై దృష్టి సారించారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బర్డ్‌ఫ్లూ.. ఈ పేరు వింటేనే జిల్లా ప్రజలు జంకుతున్నారు. తొగుట మండల పరిధిలోని కాన్గల్ గ్రామంలోని లేయర్ ఫౌల్ట్రీలో మరణించిన కోళ్ల శాంపిల్‌ను ఈ నెల 4న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు పరీక్షల నిమిత్తం పంపించగా, 7న బర్డ్‌ఫ్లూ ఉందని రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు కాన్గల్ పౌల్ట్రీఫాంలో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి పౌల్ట్రీ ఫాంలో కోళ్లను సామూహికంగా చంపేసి పూడ్చిపెడుతున్నారు. జిల్లాలో 235 వరకు పౌల్ట్రీ ఫాంలు ఉండగా 92లక్షల వరకు కోళ్లు ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా బర్డ్ ఫ్లూ భయం జిల్లా వాసులను, పౌల్ట్రీ నిర్వాహకులను వణికిస్తోంది. కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు కోరుతున్నారు. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, కోడిగుడ్ల విక్రయాలు, వినియోగం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి.
● కలకలం సృష్టిస్తున్న వైరస్
● కాన్గల్‌లో నిర్ధారించిన పశుసంవర్ధకశాఖ
● బెంబేలెత్తుతున్న పౌల్ట్రీ నిర్వాహకులు
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
జిల్లాలో బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 85004 04016ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ సంబంధిత ఆనవాళ్లు ఉంటే ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. సందేహం ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపించడంతో పాటు, సలహాలు, సందేహాలను నివృత్తి చేయనున్నారు.
బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయింది
జిల్లాలో కాన్గల్ గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ నిర్థారణ అయింది. ఆ ఫాంలోని కోళ్లను చంపి పూడ్చే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని ఇతర పౌల్ట్రీ ఫాంలలో కోళ్లు మృత్యువాత పడితే నిర్వాహకులు వెంటనే తమను సంప్రదించాలి. వైరస్ సోకకుండా పౌల్ట్రీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
–అశోక్‌కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్

బాబోయ్ బర్డ్ ఫ్లూ