
నేటి నుంచి టోల్ మోత
వాహనదారులపై మరింత భారం
తూప్రాన్: మండలంలోని అల్లాపూర్ శివారు 44వ నంబర్ జాతీయ రాహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌గేట్ మీదుగా ప్రయాణం మరింత భారం కానుంది. 5 నుంచి 10 శాతం టోల్ రేట్లు పెంచినట్లు నేషనల్ హైవే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే వాహనదారులు టోల్‌గేట్ భారం అధికంగా ఉందని గగ్గోలు పెడుతుండగా, మరోమారు రేట్లు పెంచారు. అయితే ఏటా ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. పాత ధరలను చెల్లించలేకే కొందరు వాహనదారులు అల్లాపూర్, ఇమాంపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు పాలాట, శివ్వంపేట మండలం పోతారం గ్రామం మీదుగా వెళ్తున్నారు. నిత్యం ఈ టోల్‌గేట్ మీదుగా 12 నుంచి 15 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజువారి టోల్ గేట్ రూ. 12 లక్షల నుంచి రూ. 15 వరకు ఆదాయం ఉంటుంది. పెరిగిన ధరలతో వాహనదారుల జేబుకు చిల్లు పడనుంది. కాగా టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తున్న సమయంలో చుట్టూ 20 కిలోమీటర్ల వరకు వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ. 350 చెల్లించి నెలవారీ పాసులు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కాని టోల్‌ప్లాజా సమీప గ్రామాల ప్రజలు నిత్యం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సామగ్రి కోసం రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇందుకు టోల్ రుసం ఎలా చెల్లించాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నేషనల్ హైవే అధికారులు స్పందించి స్థానికులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

నేటి నుంచి టోల్ మోత