
ఇక ఆస్తుల విస్తీర్ణం డిజిటలైజేషన్
ఇళ్లు, స్ధలాల వివాదాలకు చెక్
● సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డు ● మాస్టర్ ప్లాన్‌కు సులభతరం ● పారదర్శకంగా ఇంటి పన్నుల కుదింపు ● మున్సిపాలిటీకి పెరగనున్న ఆదాయం
హుస్నాబాద్: ఇక ముందు రెవెన్యూ రికార్డులు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు, వివాద స్ధలాలకు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్షా) కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి, విస్తీర్ణాన్ని నక్షా సర్వేతో జల్లెడ పట్టి డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నారు. ప్రతి ఇంటి యజమానికి ఆస్తి హక్కును కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, అందులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఉంది. హుస్నాబాద్‌లో మున్సిపల్ రికార్డుల ప్రకారం 7,343 ఇళ్లు ఉన్నాయి. నక్షా ఏరియల్ సర్వేతో ఆస్తుల విస్తీర్ణాన్ని డిజిటల్ పద్ధతిలో నమోదు చేయనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు ఉండే పట్టణాలు, ఇరుకుగా ఉండే చోట్ల హెలికాప్టర్‌ను ఉపయోగించి వాటికి ప్రత్యేకమైన కెమెరాలను బిగించి సర్వే పూర్తి చేశారు. పట్టణంలో 48 చోట్ల సర్వే సరిహద్దులను ఏర్పాటు చేశారు. ఏరియల్ సర్వే ద్వారా పట్టణ విస్తీర్ణాన్ని నిర్ధారించి కచ్చిమైన పట్టణ మ్యాప్‌ను తయారు చేయనున్నారు. ప్రతి ఇంటికి త్రీడీ కెమెరాతో మ్యాపింగ్ చేస్తారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో విస్తృతంగా సర్వే చేస్తున్నారు.
మాస్టర్ ప్లాన్‌కు సులభతరం
మౌలిక వసతుల కల్పన, రోడ్లు, మంచి నీటి సౌకర్యం, ఇలా పలు అంశాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మాస్టర్ ప్లాన్ అవసరం. ప్రస్తుత నక్ష ప్రకారం ఇళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలు, రహదారులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్ధలాల ఆస్తుల లెక్కలు పక్కాగా తెలుస్తోంది. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సర్వే కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఇంటింటికి తిరిగి ఇంటి ఆస్తుల వివరాలను పూర్తి స్ధాయిలో సేకరించనున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నారు.
ఆస్తి పన్నుల లెక్కా పక్కా
నక్షా సర్వే ద్వారా ప్రతి ఇంటి ఆస్తి వివరాలు గుర్తిస్తారు. ప్రస్తుతం ఒక ఇంటి (గ్రౌండ్ ఫ్లోర్)అనుమతితో రెండు, నుంచి మూడు ఫ్లోర్లు వేస్తున్నారు. మున్సిపల్ రికార్డులో ఎన్ని అంతస్తులు ఉన్న ఒక ఇంటికే పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం ఏడాది ఇంటి పన్నుల వసూళ్లు రూ.1.72 కోట్లు ఉండగా, ఈ సర్వేతో ఆదాయం రెట్టింపు కానుంది. ఈ సర్వే ద్వారా బహుళ అంతస్తుల లెక్క తేలుతుంది. ఆస్తి పన్నును మదింపు చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు
ప్రస్తుతం ప్రతిదానికి ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ తరహాలోనే ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డు ఇవ్వబోతున్నారు. ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పూర్తి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్నుల వివరాలు, విస్తీర్ణం, భూముల సర్వే నంబర్లు, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా పూర్తి స్ధాయి వివరాలు ప్రాపర్టీ కార్డులో ఉంటుంది.
సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళిక
నక్షా సర్వేతో పట్టణ సమగ్ర ప్రణాళిక రూపొందుతుంది. ప్రతి ఇంటి ఆస్తి హద్ధు లు నిర్ణయిస్తాం. యజమానికి ఆస్తి హక్కును కల్పిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో దోహదపడుతుంది. ఆస్తి పన్నుల నిర్ణయంతో పారదర్శకంగా ఆదాయాన్ని పెంచుకునే వీలు ఉంటుంది. ప్రతి ఇంటికి ప్రాపర్టీ కార్డును జారీ చేయనున్నాం. ఈ కార్డుతో రుణాలు పొందవచ్చు. – మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్

ఇక ఆస్తుల విస్తీర్ణం డిజిటలైజేషన్