ఆయన ఓ ఫ్యాక్టరీలో వర్కర్.. చిన్న ప్రమాదం జరిగి ప్రాణం పోతుంది.. కానీ కాసేపటికే లేచివస్తాడు. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తాడు. చుట్టూ ఉన్న ప్రతిదానిని తరచి చూస్తుంటాడు. అన్నీ తెలుసుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటాడు. ఆ వివరాలన్నీ ఎవరికో పంపుతుంటాడు. అంతా చిత్రంగా చూస్తుంటారు. కానీ కాసేపటికి అతను ‘ఒమిక్రాన్’ గ్రహానికి చెందిన ఏలియన్ (గ్రహాంతర వాసి) అని బయటపడుతుంది. భూమిని ఆక్రమించుకోవాలనుకునే ‘ఒమిక్రాన్’ వాసులు.. ముందుగా అన్ని వివరాలు తెలుసుకొమ్మని ఆ ఏలియన్‌ను పంపుతారు. ఇదంతా 1963 నాటి ఇటాలియన్ సినిమా ‘ఒమిక్రాన్’ కథ.
..మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సినిమా పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘కోవిడ్ వైరస్‌లపై భవిష్యత్తులో ఓ ఉత్కంఠ భరిత సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. అందులో కోవిడ్ వేరియంట్లు అన్నీ దుష్టశక్తులుగా ఉంటే.. ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఓ సూపర్ హీరోగా రంగంలోకి వస్తుంది. కరోనా వేరియంట్లు అన్నింటినీ ఓ సాధారణ జలుబు వైరస్‌లుగా మార్చేసి.. మానవాళిని కాపాడుతుంది’’ అని ట్వీట్ పెట్టారు.
‘ఒమిక్రాన్’ వేరియంట్ విపరీతంగా వ్యాప్తి చెందినా.. లక్షణాలు, ప్రమాదం రెండూ తక్కువేనని, కోవిడ్ సాధారణ జలుబుగా మారేందుకు ఇది దారితీస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించిన వార్తను తన ట్వీట్‌కు లింక్ చేశారు. ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
మొక్కలను నాశనం చేసే వైరస్‌తో..
‘ఒమిక్రాన్’ వేరియంట్‌పై ఆందోళన నేపథ్యంలో.. ఇదే పేరుతో ఉన్న మరో సినిమాపై పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆ సినిమా పేరు ‘ప్రాజెక్ట్ ఒమిక్రాన్ (ఏ విజిటర్ ఫ్రం ప్లానెట్ ఒమిక్రాన్)’. ఒమిక్రాన్ గ్రహం నుంచి వచ్చిన ఓ గ్రహాంతర వాసి.. భూమ్మీద పంటలు, మొక్కలను నాశనం చేసే వైరస్‌ను వదులుతూ ఉంటాడు. కానీ ఓ మహిళ తాను పెంచే మొక్కలు, తాజా ఉత్పత్తులతో.. అతడిపై విజయం సాధిస్తుంది.
ఢిల్లీ శివార్లలో ‘ఒమిక్రాన్’
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఓ టౌన్‌షిప్ పేరు విని జనం జడుసుకుంటున్నారు. ఎందుకో తెలుసా.. ఆ టౌన్‌షిప్ పేరు.. ‘ఒమిక్రాన్’. అంతేకాదు ఆ పక్కనే.. ఇంతకు ముందటి ‘మ్యూ’ వేరియంట్ పేరిట మరో టౌన్‌షిప్ ఉండటం గమనార్హం. కొత్త వేరియంట్‌పై ఆందోళన నేపథ్యంలో ఈ ఫొటో కూడా వైరల్‌గా మారింది. – సాక్షి సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment