100th Test: అశ్విన్‌పై మాజీ స్పిన్నర్‌ సంచలన వ్యాఖ్యలు | 100th Test Ashwin Cut Calls: Laxman Sivaramakrishnan Sensational Allegations | Sakshi
Sakshi News home page

100th Test: అశ్విన్‌పై మాజీ స్పిన్నర్‌ సంచలన ఆరోపణలు

Published Wed, Mar 6 2024 11:52 AM | Last Updated on Wed, Mar 6 2024 1:01 PM

100th Test Ashwin Cut Calls: Laxman Sivaramakrishnan Sensational Allegations - Sakshi

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కల్చర్‌ తెలిసినవాళ్లే తనలాంటి పెద్దలను గౌరవిస్తారంటూ ఘాటుగా విమర్శించాడు.

కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా అశ్విన్‌ ఇప్పటికే 500 టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరాడు. అదే విధంగా సిరీస్‌లో ఆఖరిదైన ధర్మశాల మ్యాచ్‌ సందర్భంగా తన కెరీర్‌లో వందో టెస్టు ఆడబోతున్నాడు ఈ చెన్నై ఆల్‌రౌండర్‌.

ఇలా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌ను తన ప్రయాణంలో మరుపురాని జ్ఞాపక​ంగా పదిలం చేసుకోబోతున్న ఆనందంలో ఉన్నాడు అశ్విన్‌. ఈ నేపథ్యంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అశూ అన్నకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ అభిమానులు నెట్టింట సందడి చేస్తుండగా.. సహచర ఆటగాళ్లు సైతం అతడిని అభినందిస్తున్నారు.

ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్‌, తమిళనాడుకు చెందిన లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ మాత్రం అశ్విన్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. అశ్విన్‌ను ప్రశంసిస్తూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘‘వందో టెస్టు ఆడబోతున్న అతడిని విష్‌ చేద్దామని ఫోన్‌ కాల్‌ చేశాను.

కానీ అతడు నా కాల్‌ కట్‌ చేశాడు. మెసేజ్‌ పంపినా బదులివ్వలేదు. మాజీ క్రికెటర్లమైన మాకు దక్కే గౌరవం ఇది’’ అని అశ్విన్‌పై ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో అశూ అభిమాని ఒకరు.. ‘‘బౌలింగ్‌ ఆవరేజ్‌ 44.. 26 వికెట్లు... బౌలింగ్‌ ఆవరేజ్‌ 23.9.. 507 వికెట్లు’’ అంటూ లక్ష్మణ్‌, అశ్విన్‌ బౌలింగ్‌ గణాంకాలను ప్రస్తావిస్తూ కౌంటర్‌ ఇచ్చాడు.

ప్రతిస్పందనగా.. ‘‘కల్చర్‌ తెలిసిన వాళ్లకే ఎదుటివాళ్లను గౌరవించే సంస్కారం ఉంటుంది. గతంలో అశ్విన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ గురించి నేను కొన్ని కరెక్షన్లు చెప్పాను. అంతేకానీ అతడిని విమర్శించలేదు.

నేను టీమిండియా తరఫున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడాను. మీలో ఎవరైనా భారత్‌కు నా కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారా?’’ అని లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ ఫైర్‌ అయ్యాడు. 

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభానికి ముందు శివరామకృష్ణన్‌ అశ్విన్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. భారత గడ్డ మీద అతడి కోసం తయారు చేసే పిచ్‌ల మీద మాత్రమే అశ్విన్‌ వికెట్లు తీయగలడని.. విదేశాల్లో మాత్రం అతడి పప్పులు ఉడకవని కామెంట్‌ చేశాడు.

అంతేగాకుండా అశ్విన్‌ ఓ అన్‌ఫిట్‌ క్రికెటర్‌ అని.. వేరే వాళ్లకు ఛాన్సులు రాకుండా చేస్తున్నాడంటూ ఆరోపించాడు. తాజాగా మరోసారి ఇలా అరుదైన మైలురాయికి అశూ చేరువైన సమయంలో శివరామకృష్ణన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చదవండి: Sachin Tendulkar: ఇషాన్‌, శ్రేయస్‌ల కాంట్రాక్ట్‌ రద్దు.. నేనైతే అంటూ సచిన్‌ పోస్ట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement