త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తాను పునరాగమనం చేస్తానని వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)లో భాగమమవుతానని తెలిపాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
కేవలం 33 పరుగులే
కాగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా పాక్ తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు ఫఖర్ జమాన్(Fakhar Zaman). అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పూర్తిగా తేలిపోయాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 33 పరుగులే చేశాడు. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో అమెరికా చేతిలో ఓడి పాకిస్తాన్ అవమాన భారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.
బోర్డుతో విభేదాలు
ఇక అప్పటి నుంచి ఫఖర్ జమాన్ మరోసారి పాక్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. బాబర్ ఆజం(Babar Azam)నకు మద్దతుగా నిలిచిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో సమయంలో బాబర్, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేస్తూ పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్ తప్పుబట్టాడు. ముఖ్యంగా బాబర్ విషయంలో ఇలా చేయడం సరికాదంటూ సెలక్టర్ల తీరును విమర్శించాడు.
ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. ఫఖర్ జమాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించడం వెనుక కారణమేమిటో చెప్పాలంటూ బోర్డు తరఫున షోకాజ్ నోటీస్ జారీ చేశాడు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే పీసీబీ.. ఫఖర్ జమాన్‌ను పక్కనపెట్టిందని.. అందుకే జట్టుకు ఎంపిక చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అసలు కారణం ఇదీ
ఈ విషయాలపై ఫఖర్ జమాన్ తాజాగా స్పందించాడు. ‘‘చాలా మందికి నేను జట్టుకు ఎందుకు దూరమయ్యానో తెలియదు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాను. నేను వందశాతం ఫిట్‌గా లేకపోవడం వల్లే జట్టుకు ఎంపిక చేయలేదు.
అయితే, కచ్చితంగా నేను మళ్లీ పాక్ తరఫున బరిలోకి దిగుతాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. పాకిస్తాన్ తదుపరి ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొంటాను’’ అని ఫఖర్ జమాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీతో తనకు గుర్తింపు వచ్చిందన్న ఈ వెటరన్ ప్లేయర్.. ‘‘పాకిస్తాన్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో పర్యటించింది.
ఆ జట్లలో నేను భాగం కాలేకపోయాను. కానీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం చాంపియన్స్ ట్రోఫీ మీదే ఉంది. 2017లో చాంపియన్స్ ట్రోఫీలో ప్రతిభ చూపినందు వల్లే నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఈసారి కూడా అదే తరహాలో రాణించాలని పట్టుదలగా ఉన్నాను. మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
అందుకు రెడీగానే ఉన్నాను
ఇక ఇప్పటికే ఓపెనర్‌గా యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫఖర్ జమాన్ స్పందిస్తూ.. ‘‘అతడు గొప్పగా ఆడుతున్నాడు. వచ్చే నాలుగైదేళ్లలో టాప్ బ్యాటర్‌గా ఎదుగుతాడు. ఇక మేనేజ్‌మెంట్ నన్ను నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా రెడీగానే ఉన్నాను. అన్నింటికంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం’’ అని పేర్కొన్నాడు.
కాగా 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా సెంచరీతో చెలరేగి.. పాకిస్తాన్‌కు టైటిల్ అందించాడు ఫఖర్ జమాన్. ఇదిలా ఉంటే.. 2017 తర్వాత తొలిసారిగా జరిగే చాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.
చదవండి: VHT: ఇంగ్లండ్‌తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి విశ్రాంతి!
Comments
Please login to add a commentAdd a comment