ఒకే ఓవర్లో 43 రన్స్‌.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి! | 43 Runs In An Over Ollie Robinson Breaks 134 Year Old Unwanted Record Video | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్లో 43 రన్స్‌.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!

Published Wed, Jun 26 2024 8:59 PM | Last Updated on Wed, Jun 26 2024 9:06 PM

43 Runs In An Over Ollie Robinson Breaks 134 Year Old Unwanted Record Video

ఇంగ్లండ్‌ పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లిష్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌ 134 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

కాగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లీసస్టర్‌షైర్‌- ససెక్స్‌ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌ బుధవారంతో ముగిసింది. ఆఖరి రోజు ఆటలో భాగంగా రాబిన్సన్‌ బౌలింగ్‌లో లీసస్టర్‌షైర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లూయీస్‌ కింబర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1
బ్రిగ్‌టన్‌లోని హోవ్‌ గ్రౌండ్‌లో ఓలీ రాబిన్సన్‌ చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకుని బ్యాట్‌తో అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 43 పరుగులు పిండుకున్నాడు. వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1 రన్స్‌ స్కోరు చేశాడు.

ఈ ఓవర్లో రెండో బంతి నో బాల్‌ కాగా.. తదుపరి మూడు డెలివరీల్లో 4, 6, 4 పరుగులు రాబట్టిన లూయీస్‌ కింబర్‌.. ఐదో బంతి మళ్లీ నోబాల్‌గా పడగా.. ఆ తర్వాతి డెలివరీని మళ్లీ ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత మళ్లీ నో బాల్‌ పడటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్స్‌ కొట్టాడు.

అయితే, చివరి బంతికి సింగిల్‌ మాత్రమే తీయగలిగాడు. అలా ఒకే ఓవర్లో మొత్తంగా 43 రన్స్‌ రాబట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కింబర్‌ 127 బంతుల్లోనే 243 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు. 

అయితే, లీసస్టర్‌షైర్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ససెక్స్‌ 18 పరుగుల తేడాతో గెలిచింది. కాగా రాబిన్సన్‌ ఇంగ్లండ్‌ తరఫున ఇప్పటి వరకు 20 టెస్టులాడి 76 వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్లు
1. ఓలీ రాబిన్సన్‌- 43 పరుగులు- 2024
2. అలెక్స్‌  ట్యూడర్‌- 38 పరుగులు- 1998
3. షోయబ్‌ బషీర్‌- 38 పరుగులు- 2024.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement