టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు.
అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అభిషేక్ శర్మ ఊచకోత..
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 10.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ 21, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 8, అభిషేక్ 58 పరుగులు చేసి ఔట్ కాగా.. నేహల్ వధేరా 6, ఆయుశ్ బదోని 12 పరుగులతో అజేయంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment