ప్యారిస్ ఒలింపిక్స్-2024 క్రీడలను విజయవంతంగా ప్రసారం చేసిన వయాకామ్.. పారాలింపిక్స్-2024 లైవ్ కవరేజ్ కూడా ఇవ్వన్నుట్లు ప్రకటించింది. ప్యారిస్ వేదికగా ఆగష్టు 28- సెప్టెంబరు 8 వరకు జరుగనున్న దివ్యాంగుల విశ్వ క్రీడలను డిజిటల్ మాధ్యమంలో జియో సినిమా యాప్ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఇక టీవీ ప్రేక్షకులు స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌లో పారాలింపిక్స్‌ను వీక్షించవచ్చని తెలిపింది.
ఈ విషయం గురించి వయాకామ్ స్పోర్ట్స్ మార్కెటింగ్ హెడ్ దమయంత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మన పారా అథ్లెట్లు గతంలో పతకాలు సాధించి ఈ క్రీడలపై ఆసక్తిని మరింతగా పెంచారు. పారాలింపిక్స్‌ను సెలబ్రేట్ చేసుకునే క్రమంలో గొప్ప అనుభూతి కలిగేలా మేము ఈ క్రీడలను చూపించబోతున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ పారా అథ్లెట్ల ఆదర్శప్రాయమైన కథలను మీ ముందుకు తీసుకురాబోతున్నందుకు సంతోషిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
పతకధారులుగా వారే
కాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో మొత్తం 4,400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. భారత్ నుంచి 84 మంది బరిలోకి దిగనుండగా.. జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. మొత్తంగా 12 క్రీడాంశాల్లో మన పారా అథ్లెట్లు భాగం కానున్నారు.
ఇక గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు గెలిచింది. పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి ప్యారిస్‌లో పదికి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఇక ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్యాలు కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment