కెప్టెన్‌గా ప్రపంచకప్ గెలవాలన్న టీమిండియా సారథి రోహిత్ శర్మ కల టీ20 వరల్డ్‌కప్-2024తో నెరవేరింది. ఈ మెగా టోర్నీకి ముందు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్.. ట్రోఫీని ముద్దాడగానే రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇంటర్నేషనల్ టీ20లకు వీడ్కోలు పలికాడు. అయితే, వన్డే, టెస్టుల్లో రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి చర్చ మొదలైంది. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సీనియర్ల పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించనున్నాడన్న సంకేతాల నేపథ్యంలో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి వంటి వాళ్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల డల్లాస్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన రోహిత్ శర్మకు లాంగర్ ఫార్మాట్ల రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే ఈ విషయం గురించి చెప్పాను. మరికొంత కాలం నేను క్రికెట్ ఆడుతాను’’ అని రోహిత్ పేర్కొన్నాడు.
కాగా అంతర్జాతీయ టీ20లలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా రోహిత్ శర్మ పేరుగాంచాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో 159 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. 4231 పరుగులు సాధించాడు.
అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించాడు. అదే విధంగా అత్యధిక సిక్సర్లు (205) కొట్టిన బ్యాటర్‌గానూ రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక రోహిత్ శర్మ ఖాతాలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉండటం విశేషం.
ధోని సారథ్యంలో 2007 నాటి మొట్టమొదటి పొట్టి క్రికెట్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ.. ఈ ఏడాది కెప్టెన్ హోదాలో టైటిల్ సాధించాడు. ఇక వన్డేల్లోనూ రోహిత్ శర్మకు ఘనమైన రికార్డే ఉంది.
భారత్ తరఫున 262 వన్డే మ్యాచ్‌లలో 10709 రన్స్ చేసిన హిట్‌మ్యాన్ ఖాతాలో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు.
మరోవైపు టెస్టుల్లో మాత్రం కేవలం 59 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 4138 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి.
ఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఈ ఐసీసీ టోర్నమెంట్ల తర్వాత రోహిత్ ఆటగాడిగా కొనసాగుతాడా లేదంటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment