డ్రమ్మోయ్నీ ఓవల్(సిడ్నీ): ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత ‘ఎ’ జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దీంతో రహానే నేతృత్వంలోని భారత బ్యాటింగ్‌ను పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌లు ఆరంభించారు. వీరిద్దరూ డకౌట్లుగా వెనుదిరగడంతో భారత ’ఎ’ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరుణంలో చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పుజారా 140 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. (చదవండి:ఫించ్ ఔట్.. కెప్టెన్‌గా వేడ్)
అనంతరం అజింక్యా రహానే శతకం నమోదు చేశాడు. 228 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 108 పరుగులు చేశాడు. హనుమ విహారి(15), సాహా(0), అశ్విన్(5)లు నిరాశ పరచగా, టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్(15), ఉమేశ్ యాదవ్(24) ఫర్వాలేదనిపించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రహానే, మహ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ ‘ఎ’ జట్టులో జేమ్స్ పాటిన్‌సన్ మూడు వికెట్లు సాధించగా, మైకేల్ నేసర్, ట్రావిస్ హెడ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. జాక్సన్ బర్డ్‌కు వికెట్ దక్కింది. ఒకవైపు ఆసీస్-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ జరగుతుండగానే, మరొకవైపు ఆసీస్-భారత్ ‘ఎ’ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment