లక్నోకు గుడ్‌బై చెప్పిన గంభీర్ (PC: LSG/KKR)
IPL 2024- KKR- Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఉద్దేశించి భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఎల్‌ఎస్‌జీతో తన బంధం ముగిసిందని.. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
ఈ మేరకు.. ‘‘లక్నో సూపర్ జెయింట్స్‌తో కొనసాగిన నా అద్భుత ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నా. జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరు చూపిన ప్రేమ, ఆప్యాయతలు నా ఈ ప్రయాణాన్ని మధుర జ్ఞాపకంగా మార్చాయి.
తన స్ఫూర్తిదాయక నాయకత్వంలో మమ్మల్ని ముందుకు నడిపిన డాక్టర్ సంజీవ్ గోయెంకాకు ధన్యవాదాలు. నేను అనుకున్న ప్రణాళికలు అమలు చేసేందుకు నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచారు.
భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని అద్భుతాలు చేయగలదు. ఎల్‌ఎస్‌జీ అభిమానులను గర్వపడేలా చేయడం ఖాయం. ఎల్‌ఎస్‌జీ సైన్యానికి ఆల్ ది వెరీ బెస్ట్’’ అని గంభీర్ ఎక్స్ వేదికగా లక్నో ఫ్రాంఛైజీకి వీడ్కోలు చెప్పినట్లు ప్రకటించాడు.
❤️❤️ LSG Brigade! pic.twitter.com/xfG3YBu6l4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023
అదే విధంగా.. తాను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తిరిగి చేతులు కలుపుతున్నట్లు గంభీర్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘నేను తిరిగి వచ్చేశా.. ఆకలి మీదున్నా.. నా నంబర్ 23.. అమీ కేకేఆర్’’ అంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు.
గ్లోబల్ మెంటార్‌ను చేసిన లక్నో ఫ్రాంఛైజీ.. కానీ
కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు పాత బంధాలకు స్వస్తి పలుకుతున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ సంజయ్ బంగర్‌కు గుడ్‌బై చెప్పి.. అతడి స్థానంలో ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా నియమించింది.
రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు కూడా తమ కోచ్‌లను మార్చాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం.. గంభీర్‌ను కొనసాగిస్తున్నట్లు సెప్టెంబరు 9న ప్రకటన విడుదల చేసింది.
S Sriram joins to complete our coaching staff for 2024 💙
— Lucknow Super Giants (@LucknowIPL) September 9, 2023
Full story 👉 https://t.co/4svdieJytL pic.twitter.com/8EgX2Pg8uP
అంతేకాదు ఈ మాజీ ఓపెనర్‌ను గ్లోబల్ మెంటార్‌గా ప్రమోట్ చేసినట్లు వెల్లడించింది. కానీ.. ఇంతలోనే గంభీర్ ఇలాంటి ప్రకటన చేయడం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. లక్నో యాజమాన్యం కావాలనే గౌతీని తొలగించిందని కొందరు.. కేకేఆర్‌తో చేరేందుకు అతడు కావాలనే ఎల్‌ఎస్‌జీకి గుడ్‌బై చెప్పాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
I’m back. I’m hungry. I’m No.23. Ami KKR ❤️❤️ @KKRiders pic.twitter.com/KDRneHmzN4
— Gautam Gambhir (@GautamGambhir) November 22, 2023
ఇక గంభీర్ హుందాగా చేసిన పోస్ట్‌పై స్పందించిన లక్నో సూపర్ జెయింట్స్.. ‘‘మీతో రెండేళ్లు అద్భుతంగా గడిచాయి లెజెండ్. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేయడం విశేషం. కాగా కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్ రెండుసార్లు(2012, 2014) ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక గౌతీ తిరిగి రావడంపై కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం?
Comments
Please login to add a commentAdd a comment