‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ | Sakshi
Sakshi News home page

‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’

Published Mon, May 6 2024 1:20 PM

కేకేఆర్‌ (PC: IPL)

లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్‌ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.

లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్‌లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్‌ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

సంచలన ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌(14 బంతుల్లో 32), సునిల్‌ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్‌ బ్యాటర్‌ రమణ్‌ దీప్‌ సింగ్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్‌ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్‌ రాణా(3/24, రసెల్‌(2/17), మిచెల్‌ స్టార్క్‌(1/22).. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి(3/30), సునిల్‌ నరైన్‌(1/22) లక్నో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశారు.

ఏకపక్ష విజయం
 ఫలితంగా కేకేఆర్‌ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్‌లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్‌ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్‌. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

SRH అని ఎవరన్నారు?
లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?

ఎస్‌ఆర్‌హెచ్‌ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్‌ చోప్రా శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్‌ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్‌కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్‌ టాపర్‌ను ప్రశంసించాడు. 

కాగా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌  ఈ ఎడిషన్‌  సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్‌ కామెంట్స్‌.. వసీం అక్రం కౌంటర్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement