బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు బండారు అయ్యప్ప అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున వేలం బరిలో నిలిచిన అయ్యప్పను 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే, అయ్యప్పకు ఇంతవరకు లీగ్‌లో అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.
2011 నుంచి ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 29 ఏళ్ల అయ్యప్ప.. 2015–16 రంజీ సీజన్‌లో ముంబై జట్టుపై ఆరు వికెట్లు తీసి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దీంతో అతనికి 2018–19లో ఇండియా బ్లూ జట్టు నుంచి ఆహ్వానం లభించింది. మీడియం పేస్ బౌలర్‌గా, రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా రాణిస్తున్న అయ్యప్ప, త్వరలో జరగనున్న వేలంలో భారీ ధర సొంతం చేసుకోవాలని ఆ ప్రాంతవాసులు ఆకాంక్షిస్తున్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 31 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 37 టీ20లు ఆడిన అయ్యప్ప.. మొత్తం 167 వికెట్లు పడగొట్టాడు.
వేలం బరిలో ఉన్న ఇతర తెలుగు క్రికెటర్ల విషయానికొస్తే.. హైదరాబాద్‌కు చెందిన భావనక సందీప్(ఎస్‌ఆర్‌హెచ్), రామచంద్రాపురంకు చెందిన కేఎస్ భరత్(ఆర్సీబీ), వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన హరిశంకర్ రెడ్డి(సీఎస్‌కే)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతేడాది ఐపీఎల్‌లో వీరిని కనీస బేస్ ధర 20 లక్షలకు ఆయా జట్లు సొంతం చేసుకున్నాయి. త్వరలో జరిగే మెగా వేలంలో వీరంతా భారీ ధర ఆశిస్తున్నారు.
వీరిలో ఒక్క కేఎస్ భరత్‌కు మాత్రమే ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. 2021 సీజన్‌లో భరత్ ఆర్సీబీ తరఫున 8 మ్యాచ్‌లు ఆడి 122కు పైగా స్ట్రయిక్ రేట్‌తో 191 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఈసారి వేలంలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరిలో 370 మంది భారత క్రికెటర్లు కాగా, 220 మంది విదేశీయులు ఉన్నారు.
చదవండి: IPL 2022: అందుకే ఐపీఎల్ మెగా వేలానికి దూరం: స్టార్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment