
రాజ్‌కోట్: బీసీసీఐ మహిళల సీనియర్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. విదర్భ జట్టుతో మంగళవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర జట్టు 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. చల్లా ఝాన్సీలక్ష్మి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆంధ్ర జట్టు గెలుపులో ముఖ్యపాత్ర పోషించింది. ఝాన్సీలక్ష్మి బ్యాటింగ్‌లో 33 పరుగులు చేయడంతోపాటు తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకొని 26 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర 50 ఓవర్లలో 6 వికెట్లకు 218 పరుగులు చేసింది. కెప్టెన్ నీరగట్టు అనూష (52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... పుష్పలత (39; 5 ఫోర్లు), మిరియాల దుర్గ (32; 4 ఫోర్లు) రాణించారు. విదర్భ బౌలర్లలో దిశా కసత్ మూడు వికెట్లు తీసింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు 46.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దిశా కసత్ (52; 6 ఫోర్లు, సిక్స్), నుపుర్ (43; 4 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శరణ్య గద్వాల్ రెండు వికెట్లు తీయగా... ఝాన్సీలక్ష్మి ఐదు వికెట్లతో విదర్భను దెబ్బతీసింది. రేపు జరిగే సెమీఫైనల్లో జార్ఖండ్‌తో ఆంధ్ర తలపడుతుంది. నాలుగో క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ 28 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి రైల్వేస్‌తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment