71 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయపథాన నడిపిన టైగర్ అవినాష్
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్‌లో లీగ్ చివరి మ్యాచ్ ఆడిన వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్ జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. ఓపెనర్లు మూడు పరుగులకే పెవిలియన్‌కు చేరినా బెజవాడ టైగర్స్ భారీ స్కోర్‌ను అధిగమించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
వైఎస్సార్ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు అర్జున్(47), ప్రశాంత్ కుమార్(53) తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ కరణ్ షిండే (55) అర్ధ సెంచరీ నమోదు చేయగా.. యువన్(15) సహకారం అందించాడు. కెప్టెన్ కరణ్ అజేయంగా నిలిచాడు.
సాయితేజ రెండు వికెట్లు తీయగా అఖిల్, లలిత్ మోహన్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రతిగా బెజవాడ టైగర్స్ ఓపెనర్ అభినవ్ డకౌట్ గానే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ మహీప్ రెండు పరుగులకే చేతులెత్తేశాడు. మనీష్(15)ఫోర్, సిక్సర్ బాది పెవిలియన్‌కు చేరడంతో తొలి మూడు వికెట్లు 23 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో షోయబ్.. రికీబుయ్(33)తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులను, అవినాష్‌తో కలిసి మరో 50 పరుగులను జోడించాడు.
షోయబ్ (51) ఆరు ఫోర్లతో అర్ధసెంచరీ చేయగా సాయికుమార్, దుర్గాకుమార్ చెరో ఎనిమిదేసి పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. అవినాష్(71) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించాడు.
ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన బెజవాడ టైగర్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగే ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్ మ్యాచ్ అనంతరం ప్లే ఆఫ్‌కు మిగిలిన రెండు బెర్త్‌లు తేలిపోనున్నాయి. ఇప్పటికే 12 పాయింట్లతో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment