ఆసియా కప్ 2023 నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్, బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షా.. సోమవారం భేటీ కావడం ఆసక్తి కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌కు తాను అంగీకరించినట్లు జకా అష్రఫ్ మీడియాకు వెల్లడించాడు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్‌లో శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు, పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు.
మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశముంది. భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు టీమిండియా త్వరలో వెళ్లనుందని.. ముందస్తుగా బీసీసీఐ సెక్రటరీ జై షా పాక్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.
పీటీఐతో మాట్లాడిన ఆయన.. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదిక కానుందని పేర్కొన్నారు. ''బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ సమావేశం తర్వాత ఆసియా కప్ పై స్పష్టత వచ్చింది. మా కార్యదర్శి జై షా, పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ లో నాలుగు లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత 9 మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. అందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.
ఇండియన్ టీమ్ పాకిస్థాన్ రాబోతోందన్న మీడియా వార్తలను ఆయన ఖండించారు. భారత జట్టే కాదు.. చర్చల కోసం జై షా కూడా పాకిస్థాన్ వెళ్లడం లేదని అరుణ్ ధుమాల్ తేల్చి చెప్పాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో నేపాల్ తో మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్, శ్రీలంక.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉపఖండంలో 2016 తర్వాత జరుగుతున్న తొలి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వగా.. తర్వాత 2018, 2022లలో యూఏఈలో జరిగింది.
చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్
WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి'
Comments
Please login to add a commentAdd a comment