
దుబాయ్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. యూఏఈ వేదికగా జరుగనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లోనూ అభిమానులను ఆకట్టుకునేందుకు అన్ని జట్లు సిద్ధమైపోయాయి. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయా జట్లు, ఆటగాళ్ల అభిమానులు ఐపీఎల్ విశేషాలు, గత సీజన్ తాలూకు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ మీమ్స్, వీడియోలతో హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు, కింగ్స్ ఎలెవన్ జట్టు మాజీ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఐపీఎల్-12లో ‘మన్కడింగ్’తో అశ్విన్ విమర్శల పాలైన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘కొంచెం నేర్చుకో అశ్విన్. ఇదిగో ఇలాగే నువ్వు ఆడతావు కదా’’అంటూ సెటైర్లు వేశాడు. ఇందులో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్, నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌ను హెచ్చరించాడే తప్ప మన్కడింగ్ చేయలేదు. (చదవండి: నా లైఫ్‌లోనే ఇదొక వరస్ట్: అశ్విన్)
ఇక ఇందుకు స్పందించిన అశ్విన్.. తాను బాగానే ఆడతానని నమ్ముతున్నానని, ఇందుకోసం కాస్త వేచి చూడాలని, తనదైన రోజు ఇందుకు బదులిస్తానంటూ కౌంటర్ ఇచ్చాడు. కాగా గతేడాది రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ప్రత్యర్థి జట్టు ఓపెనర్ జోస్ బట్లర్‌ను ‘మన్కడింగ్’ రనౌట్ చేయడం తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పలువురు అశ్విన్‌పై విమర్శలు గుప్పించారు. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్దమంటూ దుమ్మెత్తిపోశారు.
అయితే మరికొంత మంది సీనియర్ ఆటగాళ్లు మాత్రం అశ్విన్‌కు మద్దతుగా నిలిచారు. ఇక అశ్విన్ ప్రస్తుతం ఢిల్లీ జట్టు తరఫున మైదానంలో దిగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్.. మన్కడింగ్ గురించి గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశాడు. మన్కడింగ్‌ను తాను ప్రోత్సహించనని, అశ్విన్ ఆనాడు నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చెప్పినా.. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి అశ్విన్‌తో తప్పక చర్చిస్తానని, వికెట్‌కు 2-3 గజాల దూరంలో ఉండటం బేసిక్‌గా చీటింగ్ వంటిదేనని పేర్కొన్నాడు.
మన్కడింగ్ ఔట్ అంటే ఏమిటి?
క్రికెట్ నియమావళిలోని వివాదాస్పద నిబంధనల్లో ఇదొకటి. రూల్ 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ ఉపయోగించారు. దీంతో.. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా నియమావళిలో చేర్చింది.
ఆ పర్యటనలో వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మన్కడ్ పలుమార్లు అతడిని వారించినా పట్టించుకోలేదు. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ వెంటనే అతడిని రనౌట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ పర్యటనలో మరోసారి కూడా మన్కడ్ .. బ్రౌన్‌ను ఔట్ చేశాడు. అప్పటినుంచి ఈ రనౌట్‌ను మన్కడింగ్ ఔట్‌గా పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment