Asia Cup 2023: మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో టీమిండియాలో అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమేనని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే అంగీకరించాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ రిటరైన తర్వాత ఎవరూ కూడా అక్కడ నిలదొక్కుకోలేకపోయారని వ్యాఖ్యానించాడు. దీంతో చాలా కాలంగా నంబర్ 4 సమస్య భారత జట్టును వెంటాడుతోందని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.
వాళ్లిద్దరు దూరంగా ఉన్న కారణంగా
కాగా గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో రాణిస్తున్నప్పటికీ ఆరేడు నెలలుగా గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇక కేఎల్ రాహుల్‌దీ ఇలాంటి పరిస్థితే. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో మిడిలార్డర్ స్టార్లు ఇద్దరూ ఇలా ఆటకు దూరంగా ఉండటం మేనేజ్‌మెంట్‌కు కలవరపాటుకు గురిచేస్తోంది.
గంగూలీ, రవిశాస్త్రి వ్యాఖ్యలకు మద్దతుగా ఏబీడీ!
ప్రాక్టీస్‌లో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ అసలు సమయంలో ఎలా రాణిస్తారనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తూ.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కీలక సూచన చేశాడు.
కోహ్లి కరెక్ట్.. ఇష్టం ఉన్నా లేకపోయినా
‘‘బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానానికి విరాట్ కోహ్లి.. సరిగ్గా సరిపోతాడు. మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగల బాధ్యత తను తీసుకోగలడు. కోహ్లిని నంబర్ 4లో బ్యాటింగ్‌కు పంపాలన్న ఆలోచనను నేను నూటికి నూరు శాతం సమర్థిస్తా. కోహ్లికి ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు గానీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు తప్పక బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి ఉంటుంది.
అంతిమంగా జట్టు సమతూకంగా.. పటిష్టంగా ఉండటమే ముఖ్యం కదా’’ అని ఏబీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆసియా కప్-2023, ప్రపంచకప్-2023 టోర్నీల్లో వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిని నాలుగో స్థానంలో పంపాలన్న రవిశాస్త్రి, గంగూలీ వ్యాఖ్యలకు ఈ మేరకు వత్తాసు పలికాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న భారత్ పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
నంబర్ 4లో కోహ్లి రికార్డు ఇలా..
వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 42 మ్యాచ్‌లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సగటున 55.21 పరుగులతో 1767 రన్స్ సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో నంబర్ 4లో స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ 20 మ్యాచ్‌లలో 805 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు ఫిఫ్టీలు ఉన్నాయి.
చదవండి: Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే?
Comments
Please login to add a commentAdd a comment