ఆసియా కప్-2023కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని ఇటీవలే జట్టులో చేరిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయం తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో టీమిండియా ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు (పాకిస్తాన్, నేపాల్) రాహుల్ దూరంగా ఉంటాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ (ఆగస్ట్ 29) వెల్లడించాడు. ఈ మేరకు బీసీసీఐ కూడా అధికారికంగా ట్వీట్ చేసింది.
గతవారం రోజులుగా కేఎల్ రాహుల్ జట్టుతో పాటు కఠోరంగా శ్రమించాడని, దురదృష్టవశాత్తు అతను ఆసియాకప్ తొలి రెండు మ్యాచ్‌లకు జట్టుకు అందుబాటులో ఉండడని ద్రవిడ్ తెలిపాడు. ఈ మధ్యకాలంలో కేఎల్ రాహుల్ ఎన్‌సీఏలోనే ఉంటాడని, సెప్టెంబర్ 4న అతను ఆసియాకప్‌లో పాల్గొనడంపై తదుపరి నిర్ణయం వెలువడనుందని పేర్కొన్నాడు.
UPDATE
— BCCI (@BCCI) August 29, 2023
KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: Head Coach Rahul Dravid#TeamIndia
కాగా, ఆసియా కప్ కోసం టీమిండియా ఇవాళ కొలొంబోకు బయల్దేరింది. దీనికి ముందు జట్టు ప్రధాన కోచ్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే సందర్భంగా ద్రవిడ్.. కేఎల్ రాహుల్ విషయంలో అప్‌డేట్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023కి పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఈ నెల 30న జరుగనుంది. ముల్తాన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పాక్ –నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది.
ఈ మ్యాచ్‌కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్ ముగుస్తుంది. అనంతరం భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది.
ఆసియా కప్-2023 కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
స్టాండ్ బై: సంజూ శాంసన్.
Comments
Please login to add a commentAdd a comment