పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్న మాటను అక్షరాలా నిజం చేసి చూపించింది మిన్ను మణి. కష్టపడితే ఫలితం తప్పక దక్కుతుందడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గిరిజన గూడెంలో పుట్టి.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను మనోబలంతో జయించి.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగింది.
ఆడపిల్లలకు క్రికెట్ ఎందుకని వారించిన అమ్మానాన్నలతో పాటు.. తమ ఊరు మొత్తాన్ని గర్వపడేలా చేస్తోంది. విమర్శించిన నోళ్లే తనను కొనియాడేలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు-2023కి సన్నద్ధమవుతున్న ఈ ‘మట్టిలో మాణిక్యం’ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
మగవాళ్ల ఆట మనకెందుకు?
కేరళలోని వయనాడ్ జిల్లాలో బ్రహ్మగిరి కొండల అంచున ఉన్న గిరిజన గూడెం మిన్ను స్వస్థలం. ‘కరూచియా’ తెగకు చెందిన ఆమె తండ్రి మణి రోజువారీ కూలీ. ఆయన తెచ్చిన డబ్బుతో ఇంటిని చక్కదిద్దే బాధ్యతలు తలకెత్తుకున్న వసంత మిన్ను తల్లి. చిన్ననాటి నుంచే మిన్నుకు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది.
మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆడేది. కానీ మిన్నును అథ్లెట్‌గా చూడాలనుకున్న ఆమె తల్లిదండ్రులకు ఇది ఎంతమాత్రం నచ్చలేదు. మగవాళ్ల ఆట మనకెందుకని కూతుర్ని వారించారు. పురుషాధిక్య ప్రపంచంలో మిన్నుకు ఇంటి నుంచే ఇలాంటి పోరు మొదలైంది.
పట్టువీడలేదు.. బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయలా!
కానీ ఆమె పట్టువీడలేదు. ఎల్సమ్మ బేబీ అనే స్కూల్ పీఈటీ టీచర్‌తో పరిచయం మిన్ను రాతను మార్చింది. ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఎల్సమ్మ.. తల్లిదండ్రులను ఒప్పించి మరీ మిన్ను బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. దగ్గరుండి మరీ మిన్నును కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు తీసుకెళ్లింది.
అంచెలంచెలుగా ఎదిగి
ప్రతిభావంతురాలైన మిన్ను తన ఆటతో అక్కడున్న వాళ్లను మంత్రముగ్ధులను చేసి.. తొలుత జిల్లా స్థాయి, ఆపై అండర్ 16.. అండర్ 23లో కేరళకు ఆడింది. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత మహిళా అండర్-23, అనంతరం ఇండియా- ఏ జట్టుకు ఎంపికైంది. అయితే, ఆటలో దూసుకుపోతున్నా ‘ఆర్థిక కష్టాల కడలి’ని మాత్రం అంత తేలికగా దాటలేకపోయింది మిన్ను.
దశ తిరిగింది.. అదృష్టం వరించింది
అలాంటి సమయంలో మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో మిన్నును ‘అదృష్టం’ వరించింది. ఆమె అద్భుత ఆట తీరుకు ప్రతిఫలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ. 30 లక్షలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. దీంతో మిన్ను కుటుంబానికి కాస్త సాంత్వన లభించింది.
అయితే, ఆర్థికంగా కష్టాలు తీరినా.. తనకు ఈ డబ్బు ముఖ్యం కాదని.. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పడం.. మిన్నుకు ఆట పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఆమె ఆశయం గొప్పది.. అందుకే బంగ్లాదేశ్ పర్యటన రూపంలో అవకాశం కలిసివచ్చింది.
అరంగేట్రంలోనే సత్తా చాటి..
ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడిన టీ20 సిరీస్ సందర్భంగా ఆమెకు అవకాశం వచ్చింది. బంగ్లాతో మొదటి టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో మిన్న మణి అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
అయితే, ఈ సిరీస్‌లో మొత్తంగా ఐదు వికెట్లతో మెరిసిన మిన్ను.. తనదైన ముద్ర వేయగలిగింది. ఆరంభంలోనే అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుని వారం తిరిగే లోపే 19వ ఆసియా గేమ్స్ జట్టులో చోటు సంపాదించింది. చైనా వేదికగా సెప్టెంబరు 23 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక క్రీడల్లో భాగం కానుంది.
సమాజం నుంచి ఎన్నో విమర్శలు
‘‘క్రికెట్‌పై నాకు ఆసక్తి ఉందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులతో పాటు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. ఎనిమిదో తరగతికి వచ్చే దాకా నేను లోకల్ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలియదు. చదువుకుంటూ.. వరి పొలాల్లో పనిచేసుకుంటూ.. నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేసేదాన్ని.
స్థలం కావాలి
అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వయనాడ్ నుంచి ఓ అమ్మాయి టీమిండియాకు ఆడుతోందని చుట్టుపక్కల వాళ్లు గర్వపడుతున్నారు. నాలాగే వాళ్ల కుమార్తెలు కూడా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు’’ అని 24 ఏళ్ల మిన్ను మణి సంతోషం వ్యక్తం చేసింది. తనలాంటి అమ్మాయిలను ప్రోత్సహించేందుకు క్రికెట్ నర్సరీ నిర్మించేలా స్థలం మంజూరు చేయాలని స్థానిక పాలనా అధికారులను కోరినట్లు జాతీయ మీడియాతో తమ మనసులోని మాట బయటపెట్టింది.
అరుదైన గౌరవం.. ఆ జంక్షన్‌కు పేరు
ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో గల మనంతవాడీ మున్సిపాలిటి మిన్ను మణిని అరుదైన గౌరవంతో సత్కరించింది. మైసూర్ రోడ్డు జంక్షన్‌కు మిన్ను మణి జంక్షన్‌గా నామకరణం చేసింది. మిన్ను ఇంటి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జంక్షన్ ఉంటుంది.
ఊహించని బహుమతి
సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రమే సాధారణంగా ఇలాంటి గౌరవాలు దక్కుతాయని తాను భావించానని.. అయితే, స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఇలా తనకు ఊహించని బహుమతి ఇచ్చారని మిన్ను ఆనందంతో ఉప్పొంగిపోయింది. తమ ఇంటి నుంచి ఈ జంక్షన్ వరకు త్వరలోనే రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్పారని హర్షం వ్యక్తం చేసింది.
మట్టి సువాసనలు పరిమళించగా..
ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుండటం గర్వంగా ఉందన్న మిన్ను.. ఆల్‌రౌండర్‌గా మెగా ఈవెంట్‌లో సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. బౌలర్‌గా తనకు ప్రాధాన్యం ఉంటుందన్న మిన్ను.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రావొచ్చని చెప్పుకొచ్చింది.
మరి లెఫ్టాండ్ బ్యాటర్.. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన మిన్ను మణి ఆసియా క్రీడల్లో టీమిండియా జెర్సీ ధరించి బరిలోకి దిగితే.. ఆమె తల్లిదండ్రులతో కేరళ మొత్తం గర్విస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మట్టి సువాసనలతో పరిమళించిన తమ ఆడబిడ్డను దేశం కూడా విజయోస్తు అని దీవిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా! హ్యాట్సాఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ మిన్ను ‘మణి’!!
-సాక్షి వెబ్‌డెస్క్
చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్!
Comments
Please login to add a commentAdd a comment