నేటి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ
తొలి మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ‘ఢీ’
సాయంత్రం గం. 4:45 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాజ్‌గిర్ (బిహార్): పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందకపోవడం... ఆ తర్వాత ప్రొ హాకీ లీగ్‌లోనూ ఆడిన 16 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో విజయం సాధించడం... వెరసి ఈ ఏడాది భారత మహిళల హాకీ జట్టుకు ఏదీ కలసి రాలేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వరుసగా రెండోసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో సలీమా టెటె సారథ్యంలో భారత బృందం ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. గత ఏడాది రాంచీలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారీ టైటిల్ నిలబెట్టుకోవాలంటే టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ జట్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాయి.
తొలి రోజు జరిగే ఇతర మ్యాచ్‌ల్లో జపాన్‌తో దక్షిణ కొరియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), చైనాతో థాయ్‌లాండ్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. సోమవారం మలేసియాతో మ్యాచ్ తర్వాత భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా (12న)తో, థాయ్‌లాండ్ (14న)తో, చైనా (16న)తో, జపాన్ (17న)తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ 19న, ఫైనల్ 20న జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment