మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం | ODI World Cup 2023 AUS Vs NED Highlights: Australia Defeated Netherlands By 309 Runs, Check Full Score Details - Sakshi
Sakshi News home page

AUS Vs NED Match Highlights: మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం

Published Thu, Oct 26 2023 1:08 AM | Last Updated on Thu, Oct 26 2023 9:25 AM

Australia defeated Netherlands by 309 runs - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యర్థులు బహు పరాక్‌! వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియా ఫామ్‌లోకి వచ్చేసింది. క్రికెట్‌ కూన నెదర్లాండ్స్‌ను హడలెత్తించింది. ఏకంగా 309 పరుగుల తేడాతో అఖండ విజయం సాధించింది. ప్రపంచకప్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కాగా... వన్డే ఫార్మాట్‌ చరిత్రలో రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది.

తన ఫామ్‌ కొనసాగిస్తూ డేవిడ్‌ వార్నర్‌ (93 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా రెండో సెంచరీ చేయగా... స్టీవ్‌ స్మిత్‌ (68 బంతుల్లో 71; 9 ఫోర్లు, 1 సిక్స్‌), లబుషేన్‌ (47 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (44 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) నెదర్లాండ్స్‌ బౌలర్ల భరతం పట్టి... వీర విధ్వంసం సృష్టించి... ప్రపంచకప్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీని సాధించాడు.

40 బంతుల్లో మ్యాక్స్‌వెల్‌ 100 పరుగులు పూర్తి చేసి ఇదే టోర్నీలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మార్క్‌రమ్‌ (49 బంతుల్లో) సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్‌ జంపా (3–0–8–4) మూడు ఓవర్లతోనే స్పిన్‌ ఉచ్చు బిగించాడు.  

దంచుడు వార్నర్‌తో మొదలైతే... 
నాలుగో ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న మిచెల్‌ మార్ష్ (9) అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో డచ్‌ శిబిరానికి కలిగిన ఆనందం ఇదొక్కటే! తర్వాతంతా అలసిపోవడమే! ఎందుకంటే అప్పటికే క్రీజులో ఉన్న వార్నర్‌గానీ,  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లబు షేన్‌లు గానీ నెదర్లాండ్స్‌పై కనీస దయ చూపలేదు. బంతిని వదల్లేదు. ఫీల్డర్లను విడిచిపెట్టలేదు.

బంతిని, బౌలర్లు, ఫీల్డర్లను కలిపి బలిపీఠం ఎక్కించినట్లుగా వీరబాదుడు బాదేశారు. స్మిత్‌ 53 బంతుల్లో, వార్నర్‌ 40 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం తర్వాత స్మిత్‌ వెనుదిరిగాడు. తర్వాత లబుõÙన్‌ (42 బంతుల్లో) ఫిఫ్టీ కొడితే... వార్నర్‌ (91 బంతుల్లో) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు 84 పరుగులు జోడించారు.  
 
39వ ఓవర్లో వచ్చి... 40 బంతుల్లో శతక్కొట్టి... 
ఓ సెంచరీ, ఇద్దరి ఫిఫ్టీలతోనే ఆసీస్‌ కథ ముగియలేదు. 39వ ఓవర్లో వచ్చిన మ్యాక్స్‌వెల్‌ వరల్డ్‌కప్‌లో తన బ్యాట్‌తో కొత్త రాత (రికార్డు) రాశాడు. 48 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు 361/6. మ్యాక్సీ (75 పరుగులతో) సెంచరీకి దూరంగానే ఉన్నాడు. కానీ లీడే వేసిన 49 ఓవర్లో 4, 4, 6, 6, నోబ్‌ 6, 1, 0లతో ఏకంగా 28 పరుగులు పిండుకోవడంతో 40 బంతుల్లోనే ఎవరి ఊహకందని విధంగా శతకం పూర్తయ్యింది. 

115 వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నెదర్లాండ్స్‌ ప్లేయర్‌ లీడే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో లీడే 10 ఓవర్లలో 115 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మిక్‌ లూయిస్‌ (0/113; 2006లో దక్షిణాఫ్రికాపై), ఆడమ్‌ జంపా (0/113; 2023లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న రికార్డును లీడే అధిగమించాడు.  

6 ప్రపంచకప్‌లో ఆరో సెంచరీతో వార్నర్‌ ఈ టోర్నీలో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ సరసన చేరాడు. రోహిత్‌ శర్మ (7) అగ్రస్థానంలో ఉన్నాడు.   

స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) అకెర్మన్‌ (బి) వాన్‌ బిక్‌ 9; వార్నర్‌ (సి) ఆర్యన్‌ (బి) వాన్‌ బిక్‌ 104; స్మిత్‌ (సి) మెర్వ్‌ (బి) ఆర్యన్‌ 71; లబుషేన్‌ (సి) ఆర్యన్‌ (బి) లీడే 62; ఇంగ్లిస్‌ (సి) సైబ్రాండ్‌ (బి) లీడే 14; మ్యాక్స్‌వెల్‌ (సి) సైబ్రాండ్‌ (బి) వాన్‌ బిక్‌ 106; గ్రీన్‌ (రనౌట్‌) 8; కమిన్స్‌ (నాటౌట్‌) 12; స్టార్క్‌ (సి) అకెర్మన్‌ (బి) వాన్‌ బిక్‌ 0; జంపా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–28, 2–160, 3–244, 4–266, 5–267, 6–290, 7–393, 8–393. బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 7–0–59–1, అకెర్మన్‌ 3–0–19–0, వాన్‌ బిక్‌ 10–0–74–4, మికెరన్‌ 10–0–64–0, విక్రమ్‌జీత్‌ 4–0–27–0, వాన్‌డెర్‌ మెర్వ్‌ 5–0–41–0, బస్‌ డి లీడే 10–0–115–2. 

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: విక్రమ్‌జీత్‌ (రనౌట్‌) 25; మ్యాక్స్‌ ఓ డౌడ్‌ (బి) స్టార్క్‌ 6; అకెర్మన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హాజల్‌వుడ్‌ 10; సైబ్రాండ్‌ (సి) వార్నర్‌ (బి) మార్ష్ 11; లీడే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్‌ 4; ఎడ్వర్డ్స్‌ (నాటౌట్‌) 12; తేజ (సి) ఇంగ్లిస్‌ (బి) మార్ష్ 14; వాన్‌ బిక్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) జంపా 0; వాన్‌డెర్‌ మెర్వ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; ఆర్యన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 1; మికెరన్‌ (స్టంప్డ్‌) ఇంగ్లిస్‌ (బి) జంపా 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (21 ఓవర్లలో ఆలౌట్‌) 90. వికెట్ల పతనం: 1–28, 2–37, 3–47, 4–53, 5–62, 6–84, 7–86, 8–86, 9–90, 10–90. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–22–1, హాజల్‌వుడ్‌ 6–0–27–1, కమిన్స్‌ 4–0–14–1, మార్ష్ 4–0–19–2, జంపా 3–0–8–4. 

ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్‌ X శ్రీలంక
వేదిక: బెంగళూరు
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement