WC 2023 Aus Vs Ned- Pat Cummins Comments: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రికార్డు విజయం సాధించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితో గెలుపు సాధ్యమైందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో బుధవారం తలపడింది ఆస్ట్రేలియా.
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని డచ్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించాడు. డేవిడ్ వార్నర్(104) శతకంతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులు సాధించారు.
ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ములేపాడు
వీరి ముగ్గురి ఇన్నింగ్స్‌ను మరిపించేలా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 తరహా వినోదం అందించాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు స్కోరు చేశాడు.
90 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌట్
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించిన ఆసీస్.. నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా అత్యధికంగా 4 వికెట్లు దక్కించుకోగా.. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా తర్వాత..
ఈ క్రమంలో వన్డే చరిత్రలో ప్రత్యర్థిని అత్యంత భారీ తేడాతో ఓడించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీమిండియా(శ్రీలంక మీద 317 పరుగుల తేడాతో) తర్వాత ఈ ఘనత సాధించిన టీమ్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
చాలా చాలా సంతోషంగా ఉంది
ఈ నేపథ్యంలో విజయానంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన విజయం. ప్రత్యర్థికి 400 పరుగుల లక్ష్యాన్ని విధించడం.. దానిని కాపాడుకోవడం.. రెండింటిలోనూ మేము పూర్తిగా విజయవంతమయ్యాం.
ఆ వందలో నాకూ భాగం ఉంది
ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. క్రేజీ ఇన్నింగ్స్. ఆ వంద పరుగుల భాగస్వామ్యంలో మా ఇద్దరి పాత్ర సమానమే కదా(నవ్వులు).. అద్భుతమైన ఇన్నింగ్స్. నేనిలాంటి క్లీన్ హిట్టింగ్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు’’ అంటూ మాక్స్‌వెల్‌పై ప్రశంసలు కురిపించాడు.
అదే విధంగా స్మిత్ కూడా హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్న కమిన్స్.. ‘‘మా ఆట తీరు ఎలా ఉండాలనుకుంటామో ఈరోజు అలాగే ఆడాం. పవర్ ప్లేలో వీలైనన్ని వికెట్లు తీయాలన్న వ్యూహం అమలు చేశాం. జంపా మరోసారి నాలుగు వికెట్లు కూల్చాడు’’ అని బౌలింగ్ విభాగాన్ని కూడా ప్రశంసించాడు.
మాక్సీ- కమిన్స్ జోడీ చరిత్ర.. అందుకే అలా సరదాగా
కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ చరిత్రలో 100+ పరుగుల భాగస్వామ్యంలో హయ్యస్ట్ రన్‌రేటు(14.37 (103) సాధించిన మూడో జోడీగా మాక్స్‌వెల్- కమిన్స్ జోడీ చరిత్ర సృష్టించింది. ఈ గణాంకాలను ఉద్దేశించే కమిన్స్.. మాక్సీతో పాటు తాను కూడా ఈ పార్ట్‌నర్‌షిప్‌లో సమాన పాత్ర పోషించానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.
చదవండి: WC 2023: పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment