సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ డ్రగ్స్ సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 2021 ఏప్రిల్‌లో కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్‌నకు ప్రయత్నించి కొట్టారంటూ మెక్‌గిల్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు చేయగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరుగురు నిందితులను విచారించగా, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో మెక్‌గిల్ కూడా ఒకడని తెలిసింది. ఈ క్రమంలో వారి మధ్య వచ్చిన విభేదాల వల్లే కిడ్నాప్ ఉదంతం జరిగిందని విచారణలో తేలింది. దాంతో గిల్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. మెక్‌గిల్‌కు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ లభించింది.
కాగా తనను కిడ్నాప్ చేసిన సమయంలో నిందితులు.. ఒంటిపై దుస్తులు తీసేసి.. దారుణంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారంటూ మెక్‌గిల్ గతంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా అతడి వక్రబుద్ధి గురించి నిజం బయటకు వచ్చింది. ఇక ఆసీస్ స్టార్ స్పిన్నర్‌గా ఎదిగే సమయంలో షేన్ వార్న్ నుంచి పోటీ మెక్‌గిల్ అవకాశాలను దెబ్బతీసింది. 52 ఏళ్ల ఈ లెగ్‌స్పిన్నర్ ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టుల్లో 208 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment