ఉత్కంఠభరిత, ఉద్విగ్న క్షణాలు... హోరాహోరీ సమరాలు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు... అన్ని కలగలిసిన టెస్టు సిరీస్‌లో అంతిమ ఫలితం కోసం ఆఖరి రోజు వరకు ఆగాల్సి రావడంకంటే మించిన ఆసక్తికర ముగింపు ఏముంటుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి ఉంది. రెండేళ్ల క్రితంనాటి ఓటమి జ్ఞాపకాలను మరిచేలా ఈసారైనా సొంతగడ్డపై సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న ఆసీస్ నాలుగో టెస్టులో 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచి సవాల్ విసిరింది.
చివరి రోజు అందుబాటులో ఉన్న 98 ఓవర్లలో టీమిండియా 324 పరుగులు సాధించాల్సి ఉంది. దూకుడైన ఆటతో రహానే బృందం దీనిని అందుకునేందుకు ప్రయత్నిస్తుందా లేక ట్రోఫీ నిలబెట్టుకునే అవకాశం ఉండటంతో ‘డ్రా’వైపు మొగ్గు చూపుతుందా చూడాలి. బ్రిస్బేన్‌లో గత రికార్డులు చూస్తే ఇది అసాధ్యంగానే కనిపిస్తున్నా... మన జట్టుకు రికార్డులు తిరగరాయడం కొత్తేమీ కాదు. అయితే అన్నింటికి మించి ఆఖరి రోజు వర్షం కీలకంగా మారనుంది. ఎన్ని ఓవర్ల ఆట సాధ్యం అవుతుందనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
బ్రిస్బేన్: వరుసగా రెండో పర్యటనలోనూ భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించగలదా... లేక సిరీస్‌ను సమంగా ముగించి ట్రోఫీని నిలబెట్టుకోగలదా అనేది నేడు తేలనుంది. చివరి టెస్టులో ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (4 బ్యాటింగ్), గిల్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 1.5 ఓవర్ల తర్వాతే వాన రావడంతో ఆటను నిలిపివేయగా... వాన తగ్గే అవకాశం కనిపించకపోవడంతో నాలుగో రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు. రెండు సార్లు వర్షం అడ్డంకి కలిగించడంతో సోమవారం 71.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (74 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, వార్నర్ (75 బంతుల్లో 48; 6 ఫోర్లు) రాణించాడు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/73)తో చెలరేగాడు. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు 4 వికెట్లు దక్కాయి.
శుభారంభం
సాధ్యమైనంత వేగంగా బ్యాటింగ్ చేసి భారత్ ముందు కఠిన లక్ష్యాన్ని ఉంచాలనే ప్రణాళికతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు చాలా వరకు సఫలమైంది. 3.87 రన్‌రేట్‌తో ఆసీస్ పరుగులు సాధించింది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో విఫలమైన తర్వాత ఎట్టకేలకు వార్నర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చగా, మార్కస్ హారిస్ (82 బంతుల్లో 38; 8 ఫోర్లు) కూడా అండగా నిలిచాడు. వీరిద్దరు వరుస బౌండరీలతో చకచకా పరుగులు సాధించడంతో ఒక దశలో భారత్ అటాకింగ్ ఫీల్డింగ్‌ను మార్చేసి ఆత్మరక్షణలో పడింది. అయితే 89 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత శార్దుల్ షార్ట్ బంతితో హారిస్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా... తర్వాతి ఓవర్లో సుందర్ బౌలింగ్‌లో వార్నర్ ఎల్బీగా దొరికిపోయాడు. ఆసీస్ ఓపెనర్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు లబ్‌షేన్ (22 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీశాడు. స్లిప్‌లో రోహిత్ చక్కటి క్యాచ్‌కు లబ్‌షేన్ వెనుదిరగ్గా, మరో చక్కటి బంతికి వేడ్ (0) పెవిలియన్ చేరాడు. 123/4 వద్ద ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలుతున్నట్లు అనిపించింది.
కీలక భాగస్వామ్యం
టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ ఆసీస్‌ను మరోసారి ఆదుకున్నాడు. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన స్మిత్ ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. కామెరాన్ గ్రీన్ (90 బంతుల్లో 37; 3 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు స్మిత్ 73 పరుగులు జత చేశాడు. ఇలాంటి స్థితిలో మరోసారి సిరాజ్ తన విలువను ప్రదర్శించాడు. అతను వేసిన పదునైన బంతిని ఆడలేక స్మిత్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. బంతి తన గ్లవ్‌కు తాకిన సమయంలో బ్యాట్ ఆ చేతిలో లేదనే సందేహంతో స్మిత్ రివ్యూ కోరగా, ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ తర్వాత గ్రీన్‌ను శార్దుల్ అవుట్ చేశాడు. అయితే కెప్టెన్ పైన్ (37 బంతుల్లో 27; 3 ఫోర్లు), కమిన్స్ (51 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా చివర్లో కొన్ని పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా సంతృప్తికర స్కోరును సాధించగలిగింది.
సిరాజ్ రెండు క్యాచ్‌లు మిస్
నాలుగో రోజు కూడా ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. సుందర్ బౌలింగ్‌లో 42 పరుగుల వద్ద స్మిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను సరిగా అంచనా వేయలేక సిరాజ్ వదిలేశాడు. అతను తన స్కోరుకు మరో 13 పరుగులు జోడించాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌లోనే గ్రీన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కూడా సిరాజ్ అందుకోలేకపోయాడు. ఈ సమయంలో 14 పరుగుల వద్ద ఉన్న గ్రీన్ మరో 23 పరుగులు సాధించాడు.
వాన... వాన...
ప్రఖ్యాత ‘అక్యువెదర్’ వెబ్‌సైట్ సహా ఆస్ట్రేలియాలోని వివిధ వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం మంగళవారం కూడా బ్రిస్బేన్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో కనీసం గంట పాటు వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారనుంది. సోమవారం రాత్రి కూడా వాన కురుస్తున్న కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. ఇదే జరిగితే 98 ఓవర్ల ఆట సాధ్యం కాకపోవచ్చు. సమయం వృథా అవుతున్నకొద్దీ ఆసీస్ విజయావకాశాలు తగ్గుతున్నట్లే. భారత్ మాత్రం మిగిలిన ఓవర్లలో గట్టిగా నిలబడి ‘డ్రా’ చేసుకున్నా సరిపోతుంది. వర్షం కారణంగా చివరి టెస్టులో రెండో రోజు, నాలుగో రోజు అంతరాయం కలగవచ్చని నిపుణులు వేసిన అంచనా కూడా నిజమైంది కాబట్టి ఇది కూడా తప్పకపోవచ్చు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369
భారత్ తొలి ఇన్నింగ్స్: 336
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (సి) రిషభ్ పంత్ (బి) శార్దుల్ ఠాకూర్ 38; డేవిడ్ వార్నర్ (ఎల్బీ) (బి) వాషింగ్టన్ సుందర్ 48; లబ్‌షేన్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 25; స్టీవ్ స్మిత్ (సి) రహానే (బి) సిరాజ్ 55; వేడ్ (సి) రిషభ్ పంత్ (బి) సిరాజ్ 0; గ్రీన్ (సి) రోహిత్ శర్మ (బి) శార్దుల్ ఠాకూర్ 37; టిమ్ పైన్ (సి) రిషభ్ పంత్ (బి) శార్దుల్ ఠాకూర్ 27; కమిన్స్ (నాటౌట్) 28; స్టార్క్ (సి) నవదీప్ సైనీ (బి) సిరాజ్ 1; నాథన్ లయన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) శార్దుల్ ఠాకూర్ 13; హాజల్‌వుడ్ (సి) శార్దుల్ ఠాకూర్ (బి) సిరాజ్ 9; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (75.5 ఓవర్లలో ఆలౌట్) 294.
వికెట్ల పతనం: 1–89, 2–91, 3–123, 4–123, 5–196, 6–227, 7–242, 8–247, 9–274, 10–294.
బౌలింగ్: సిరాజ్ 19.5–5–73–5, నటరాజన్ 14–4–41–0, వాషింగ్టన్ సుందర్ 18–1– 80–1, శార్దుల్ ఠాకూర్ 19–2–61–4, నవదీప్ సైనీ 5–1–32–0.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 4; గిల్ (బ్యాటింగ్) 0; మొత్తం (1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 4.
బౌలింగ్: స్టార్క్ 1–0–4–0, హాజల్‌వుడ్ 0.5–0–0–0.
Comments
Please login to add a commentAdd a comment