బర్మింగ్‌హమ్: ఉదయం సెషన్‌లో చినుకులు... మధ్యాహ్నం సెషన్‌లో వికెట్లు... సాయంత్రం సెషన్‌లో టెయిలెండర్ల పరుగులు... ఆఖరి రోజును ఆద్యంతం రక్తికట్టించాయి. ఆ్రస్టేలియా బ్యాటర్స్ నిరాశ పరిచిన చోట... ఇంగ్లండ్ బౌలింగ్ పదునెక్కుతున్న వేళ... ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్‌లో వీళ్లిద్దరు పిచ్‌పై పరుగులతో పాగా వేశారు.
అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆ్రస్టేలియాను ఓటమి కోరల్లోంచి గెలుపు మజిలీకి చేర్చారు. దీంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 281 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 107/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆ్రస్టేలియా 92.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి గెలిచింది.
ఆఖరి రోజు ఆసీస్ విజయానికి 174 పరుగులు అవసరం కాగా... ఆశలు పెట్టుకున్న ప్రధాన బ్యాటర్స్ ట్రెవిస్ హెడ్ (16; 3 ఫోర్లు), గ్రీన్ (28; 2 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (65; 7 ఫోర్లు) కీలకమైన తరుణంలో ఇంగ్లండ్ బౌలింగ్‌కు తలవంచారు. ఫామ్‌లో ఉన్న క్యారీ (20; 2 ఫోర్లు) అవుటైనప్పుడు ఆసీస్ స్కోరు 227/8. లక్ష్యానికి 54 పరుగుల దూరం. మిగిలిందల్లా టెయిలెండర్లే కావడంతో ఆసీస్‌పై ఆసీస్‌కే గెలుస్తామన్న ఆశల్లేవు. ఈ దశలో కమిన్స్, లయన్ ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొని, వికెట్ల ముందు గోడకట్టి మరీ గెలిచేందుకు పరుగు... పరుగు జత చేశారు.
ఆసీస్‌కు ‘డ్రా’ చేసుకోవడమే గగనం అనుకుంటే ఇద్దరి వీరోచిత ప్రదర్శన ఏకంగా విజయాన్నే కట్టబెట్టింది. అటకు ముందు ఆఖరి రోజు రసపట్టులో ఉన్న టెస్టుతో వర్షం కూడా చాలా సేపు దోబూచులాడింది. దీంతో తొలి సెషన్ పూర్తిగా రద్దయ్యింది. దీంతో అందుబాటులో ఉన్న 67 ఓవర్లలోనే ఆ్రస్టేలియా లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలో నిలువగా, ఇరు జట్ల మధ్య 28 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్టు జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్; ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: 386 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 282/8 (92.3 ఓవర్లలో) (ఖ్వాజా 65, వార్నర్ 36, కమిన్స్ 44 నాటౌట్, బ్రాడ్ 3/64).
Comments
Please login to add a commentAdd a comment