
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు ఆక్టోబర్ 19న పుణే వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. షకీబ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. చెన్నై వేదికగా న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా షకీబ్ తీవ్రమైన నొప్పితో ఆడాడు.
షకీబ్ నొప్పితో బాధపడుతున్నప్పటికీ మైదానాన్ని మాత్రం వీడలేదు. ఇక ఇదే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అతడు మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు.
ఎందుకంటే అతడు ప్రస్తుతం తొడ కండరాల నొప్పితో బాధపడతున్నాడు. అతడు ప్రస్తుతం మా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఒక వేళ భారత్‌తో మ్యాచ్‌కు షకీబ్ దూరమైతే లిటన్ దాస్ సారథ్యం వహించే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
చదవండి: #Shahid Afridi: షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం