
వెస్టిండీస్‌తో తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. సెయింట్ లూసియా నుంచి డొమినికాకు ఐదు గంటలు పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లా ఆటగాళ్లలో చాలా మంది ఇప్పటి వరకు సముద్ర ప్రయాణం చేయలేదు. దీంతో ఫెర్రీ(వ్యాపార నౌక) బయలుదేరగానే చాల మంది ఆటగాళ్లు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వీరిలో ముఖ్యంగా షోరీఫుల్ ఇస్లాం, నఫీస్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
"ఫెర్రీ సముద్రం మధ్యలోకి చేరుకోగానే అలలు మొదలయ్యాయి. ఇది పెద్ద ఫెర్రీ కాదు కాబట్టి, అలలు కారణంగా ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఫెర్రీ విపరీతంగా ఊగింది. ఫలితంగా, క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారని" బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో పేర్కొంది.
"నేను చాలా దేశాలు తిరిగాను. కానీ సముద్ర మార్గం గుండా ప్రయాణించడం ఇదే తొలి సారి. మాలో ఎవరికీ ఇటువంటి ప్రయాణాలు అలవాటు లేదు. ఆ సమయంలో మేము ఆట గురించి మర్చిపోయాం.ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలి అనుకున్నాము. ఇది నా జీవితంలో అత్యంత చెత్త పర్యటన" అని బంగ్లాదేశ్ క్రికెటర్ ఒకరు పేర్కొన్నారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 డొమినికా వేదికగా శనివారం జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్‌నైనా కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
చదవండి: Rishabh Pant Century: పంత్ సెంచరీ... సాధారణంగా ద్రవిడ్ ఇలా రియాక్ట్ అవ్వడు! వైరల్ వీడియో!