మిరాజ్, షకీబ్
ఢాకా: టెస్టు చరిత్రలో బంగ్లాదేశ్ తమకంటూ ఓ ఘన చరిత్రను సొంతం చేసుకుంది. చివరిదైన రెండో టెస్టులో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటిదాకా 112 టెస్టులాడిన బంగ్లాదేశ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే ఇందులో ఇన్నింగ్స్ విజయం లభించడం మాత్రం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తద్వారా ఐదు నెలల క్రితం వెస్టిండీస్ గడ్డపై తమకెదురైన వైట్‌వాష్‌కు బదులు తీర్చుకుంది. బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం ఒక్కరోజే అతను 9 వికెట్లను పడగొట్టిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు.
ఓవర్‌నైట్ స్కోరు 75/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాకు 387 పరుగుల భారీ అధిక్యం లభించింది. హెట్‌మైర్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్), డౌరిచ్ (37; 3 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మెహదీ హసన్ (7/58) స్పిన్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తలవంచారు. తర్వాత ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. టాపార్డర్‌లో హోప్ (25), రోచ్ (37; 7 ఫోర్లు) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా... హెట్‌మైర్ (93; 1 ఫోర్, 9 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మెహదీ హసన్ 5, తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 508 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment