టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ బరిందర్ స్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే దేశవాలీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 31 ఏళ్ల స్రాన్ 2016లో టీమిండియా తరఫున 6 వన్డేలు, 2 టీ20లు ఆడి 13 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో స్రాన్ కేవలం 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ ప్రదర్శనకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్రాన్ తన వన్డే, టీ20 కెరీర్‌లను ఎంఎస్ ధోని నేతృత్వంలోనే ప్రారంభించాడు. అప్పట్లో స్రాన్‌కు ధోని మద్దతు బాగా ఉండేది. స్రాన్ ఓ మోస్తరుగా రాణించినా టీమిండియాలో చోటు కాపాడుకోలేకపోయాడు. స్రాన్ వన్డే అరంగేట్రం చేసే సమయానికి కేవలం ఎనిమిది లిస్ట్-ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. స్వల్ప వ్యవధిలోనే అతను అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
స్రాన్ వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్‌లోనూ ఆడాడు. అతను రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ తరఫున 24 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు. స్రాన్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను 2019లో.. లిస్ట్-ఏ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అప్పటినుంచి అతనికి అవకాశాలు రాక క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment