ముంబై: కరోనాతో పాటు ఐపీఎల్ నిర్వహణ కారణంగా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉండటంతో బీసీసీఐ దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను కుదించింది. ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలు మాత్రమే నిర్వహించేందుకే బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు బ్యాటింగ్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, ఐపీఎల్ తాత్కాలిక సీఈవో హేమంగ్ అమీన్‌లతో కూడిన బృందం షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 17 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, డిసెంబర్ 13 నుంచి మార్చి 10 మధ్య రంజీ ట్రోఫీలను బీసీసీఐ నిర్వహించనుంది.
ఈసారి దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలపై వేటు వేసింది. అయితే జూనియర్, మహిళల క్రికెట్‌లో అన్ని టోర్నీల నిర్వహణకూ మొగ్గు చూపింది. సీకే నాయుడు అండర్–23 ట్రోఫీ (డిసెంబర్ 15– 9 మార్చి 2021), కూచ్ బెహర్ ట్రోఫీ (నవంబర్ 1– 22 జనవరి 2021), విజయ్ మర్చంట్ (నవంబర్ 1– 7 జనవరి 2021)లు, మహిళల క్రికెట్‌లో టి20 లీగ్ (నవంబర్ 1–20), అండర్–23 వన్డే లీగ్ (నవంబర్ 30–డిసెంబర్ 23), అండర్–23 టి20 లీగ్ (జనవరి 27–ఫిబ్రవరి 15), అండర్–19 వన్డే లీగ్ (డిసెంబర్ 29–జనవరి 21), అండర్–19 టి20 ట్రోఫీ (ఫిబ్రవరి 21–మార్చి 11), వన్డే లీగ్ (మార్చి 17–ఏప్రిల్ 12)లు నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment