
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐ ప్రత్యేక అనుమతితో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ సీజన్‌లో ముంబై తరపున శ్రేయాస్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా జట్టులో 16వ అనధికారిక ఆటగాడిగా అయ్యర్ కొనసాగనున్నాడు. వాస్తవానికి జట్టుకు 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు.
అయితే బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇవ్వడంతో ముంబై జట్టు శ్రేయాస్‌ను 16వ ఆటగాడిగా తీసుకుంది. ఇక అంతకముందు శార్దూల్ ఠాకూర్ టి20 ప్రపంచకప్‌కు స్టాండ్ బైగా ఎంపికవడంతో అతని స్థానంలో సూర్యాన్ష్ హెగ్డేను జట్టులోకి తీసుకుంది. ఇక అక్టోబర్ 20 రాజ్‌కోట్ వేదికగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
అయితే తొలుత శ్రేయాస్ అయ్యర్‌ను టి20 ప్రపంచకప్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. జట్టులో అదనపు బ్యాటర్‌గా రాణించగల సత్తా ఉన్న అయ్యర్‌ను ఆస్ట్రేలియాకు పంపకపోవడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే జట్టులో అదనపు బ్యాటర్స్ అవసరం పెద్దగా లేదని గుర్తించినందునే అయ్యర్‌ను ఆసీస్‌కు పంపలేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది.