BCCI: శ్రేయస్‌ అయ్యర్‌కు శుభవార్త!? | No Concern For Shreyas Iyer Fitness KKR Captain To Join IPL Camp: Report | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌ అభిమానులకు శుభవార్త.. ​కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు!

Published Fri, Mar 15 2024 12:15 PM | Last Updated on Fri, Mar 15 2024 1:47 PM

No Concern For Shreyas Iyer Fitness KKR Captain To Join IPL Camp: Report - Sakshi

ఐపీఎల్‌-2023 నేపథ్యంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అభిమానులకు శుభవార్త! ఆ జట్టు కెప్టెన్‌, టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం.

రెండు రోజుల వ్యవధిలో అతడు కేకేఆర్‌ ప్రి- ఐపీఎల్‌ క్యాంపులో చేరనున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్‌ విజేత ముంబై జట్టు మేనేజర్‌ భూషణ్‌ పాటిల్‌ ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది.

కాగా రంజీ తాజా సీజన్‌ ఆరంభం నుంచి ముగింపు మధ్యలో శ్రేయస్‌ అయ్యర్‌ కెరీర్‌లో సంచలన మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ముంబై తరఫున రంజీ బరిలో దిగిన అయ్యర్‌.. ఆ తర్వాత టీమిండియాతో చేరాడు.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల్లో విఫలం కావడంతో బీసీసీఐ అతడిని పక్కనపెట్టింది. ఈ క్రమంలో వెన్నునొప్పితో బాధపడుతున్న అతడు.. జాతీయ క్రికెట్‌ అకాడమీలో చేరాడు. అయితే, అప్పటికే బీసీసీఐ.. సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్లను ఉద్దేశించి ఓ నిబంధన ప్రవేశపెట్టింది.

జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. పూర్తి ఫిట్‌గా ప్రతీ ఆటగాడు రంజీల్లో ఆడాలని ఆదేశించింది. దీంతో తాను ఫిట్‌గా లేనంటూ అయ్యర్‌ ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు తెలియజేయగా.. ఎన్సీఏ అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు చెప్పడంతో అతడిపై వేటు పడింది.

క్రమశిక్షణరాహిత్యం నేపథ్యంలో యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ కాంట్రాక్టును కూడా బీసీసీఐ రద్దు చేసింది. ఈ క్రమంలో మళ్లీ రంజీ టోర్నీలో అడుగుపెట్టిన అయ్యర్‌.. విదర్భతో ఫైనల్‌ మ్యాచ్‌లో అదరగొట్టాడు. 95 పరుగులతో అదరగొట్టి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

అయితే, బ్యాటింగ్‌ అనంతరం రెండురోజుల పాటు అయ్యర్‌ ఫీల్డింగ్‌కు దూరంగా ఉండటంతో వెన్నునొప్పి తిరగబెట్టిందనే వార్తలు వచ్చాయి. ఫలితంగా అతడు ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ముంబై జట్టు మేనేజర్‌ భూషణ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్‌ ఫిట్‌నెస్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడు బాగున్నాడు. రెండు రోజుల్లో ప్రి- ఐపీఎల్‌ క్యాంపులో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. అయ్యర్‌ కాంట్రాక్టు విషయంలో బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టును పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి.

చదవండి: హార్దిక్‌ రిటైర్‌ అవ్వటమే బెటర్‌: భారత మాజీ పేసర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement